కలం, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ డ్రోన్ దాడి (Israel drone strike) లో ఇరాన్‌కు చెందిన ఖుద్స్ ఫోర్స్ టాప్ కమాండర్ ఒకరు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు, షిన్‌బెట్ సెక్యూరిటీ ఏజెన్సీ గురువారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధంగా ఉన్న ఖుద్స్ ఫోర్స్‌లో హుస్సేన్ మహమూద్ మర్షద్ అల్ జవహరి సీనియర్ లెవెల్ టాప్ కమాండర్. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగిన అనేక తీవ్రవాద కార్యక్రమాల్లో హస్సేన్ మహమూద్ కీలక పాత్ర పోషించాడు. లిబియా–సిరియా సరిహద్దు ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోశాడు. దీనికోసం ఖుద్స్ ఫోర్స్‌లోని యూనిట్–840 విభాగాన్ని వాడుకున్నాడని ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఈ క్రమంలో గురువారం ఈశాన్య లెబనాన్ వద్ద హుస్సేన్ మహమూద్ ఓ వాహనంలో వెలుతున్నట్లు ఇజ్రాయెల్ దళాలు పసిగట్టాయి. వెంటనే దానిపై డ్రోన్‌తో దాడి (Israel drone strike) చేశాయి. ఈ దాడిలో హుస్సేన్ మహమూద్ అక్కడికక్కడే మరణించాడు. దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ విడుదల చేసింది. కాగా, దాడిని లెబనాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. సిరియా సరిహద్దులో జరిగిన ఒక వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించారని పేర్కొంది. అయితే, చనిపోయినవాళ్ల వివరాలు వెల్లడించలేదు.
Read Also: నేతాజీ అవశేషాలు భారత్‌కు తెప్పించండి.. రాష్ట్రపతికి ముని మనవడి లేఖ
Follow Us On: Pinterest


