తెలంగాణ స‌ర్కార్‌కు కేంద్రం బిగ్ షాక్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ స‌ర్కార్‌ (Telangana Govt) కు కేంద్రం షాకిచ్చింది. పాలమూరు-రంగారెడ్డి (Palamuru-Rangareddy) ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోరుతూ పంపించిన‌ డీపీఆర్‌ (DPR)ను కేంద్ర జలశక్తి శాఖ తిరస్కరించింది. మ‌ళ్లీ స‌ద‌రు డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికే వెనక్కి పంపింది. ప్రాజెక్టు వల్ల ఆశించిన పూర్తి ప్రయోజనాలు లభించాలంటే సమగ్ర ప్రణాళికతో కూడిన కొత్త ప్రతిపాదనలను సమర్పించాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు కూడా జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదనలేవీ తమ పరిశీలనలో లేవని వెల్ల‌డించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విధానంపై పార్ల‌మెంట్‌లో ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వ‌కంగా స‌మాధాన‌మిచ్చింది. జాతీయ ప్రాజెక్టుల నిబంధనల ప్రకారమే హోదా కల్పించే ప్రక్రియ జరుగుతుందని మంత్రి రాజ్ భూష‌ణ్‌ చౌద‌రి తెలిపారు. అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల వివాదాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు, భారీ ఎత్తున సాగునీటి రక్షణను కల్పించే అత్యంత కీలకమైన ప్రాజెక్టులకే ఈ హోదా ఇస్తారని వెల్ల‌డించారు. ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించడం కోసం ఏ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావిస్తూ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కేంద్ర జల సంఘానికి అందినట్లు మంత్రి వెల్ల‌డించారు. అయితే, ఈ ప్రాజెక్టు ద్వారా ఆశించిన పూర్తి ప్రయోజనాలు లభించాలంటే సమగ్ర ప్రణాళిక చాలా అవసరమని పేర్కొంటూ, సీడబ్ల్యూసీ ఈ డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపిందని వివరించారు. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>