కలం, ఖమ్మం బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల అణచివేతే కాదు.. సమాజ శ్రేయస్సు, గిరిజన చిన్నారుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు (Cherla Police) అడుగులు వేశారు. లాఠీ పట్టిన చేతులతోనే అక్షరాల బాట వేస్తూ, కాకి దుస్తుల వెనుక తమ కరుణాంతరంగాన్ని చాటుకుని ఏజెన్సీ పల్లెలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, మారుమూల గిరిజన ప్రాంతమైన బక్కచింతలపాడు గ్రామంలో చర్ల పోలీసుల స్వయం పర్యవేక్షణ, ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వైభవంగా ప్రారంభించారు. మారుమూల గ్రామంలో విద్యాలయం అందుబాటులోకి రావడంతో గ్రామస్తుల హర్షాతిరేకాల మధ్య పండుగ వాతావరణం నెలకొంది.
పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఎస్పీ రోహిత్ రాజు చిన్నారులకు స్కూల్ బ్యాగులు, పలకలను స్వయంగా పంపిణీ చేశారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యతోనే గిరిజన ప్రాంతాల ప్రగతి..
విద్య అనేది ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు సైతం నాణ్యమైన చదువును అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలనే సంకల్పంతోనే ఈ పాఠశాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, వారిలో నైతిక విలువలు పెంపొందించాలని సూచించారు. కేవలం చదువే కాకుండా క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
అనారోగ్యం, ప్రమాదాలు జరిగినప్పుడు మూఢనమ్మకాలతో సమయం వృథా చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి సరైన వైద్య చికిత్స పొందాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు రోగనిరోధక టీకాలు వేయించాలని కోరారు.
అనంతరం రోడ్డు భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఎస్పీ, వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం బడి నిర్మించి ఇచ్చిన చర్ల పోలీసులకు బక్కచింతలపాడు ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

