కలం డెస్క్ : ‘రైతుభరోసా’ (Rythu Bharosa) స్కీమ్ సాయం కోసంరైతులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పంట పనులు మొదలయ్యే టైమ్‌కే బ్యాంకు ఖాతాల్లో వచ్చిపడ్డాయి. ఇప్పుడు కూడా అలాగే వస్తుందనే ఆశలున్నాయి. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. చాలా జిల్లాల్లో వరి సాగు పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల నాట్లు కూడా పడ్డాయి. కానీ రైతులకు స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి దానిపై ఎలాంటి సమాచారం అందలేదు. వ్యవసాయ శాఖలో సైతం దీనిపై కదలిక లేదు. సాగుభూముల లెక్క తేల్చడానికి శాటిలైట్ మ్యాపింగ్ పూర్తయిన తర్వాతే ఫండ్స్ రిలీజ్ అవుతాయని సచివాలయ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. మరోవైపు జెడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సమయానికి దీనిపై స్పష్టత రావచ్చని అధికార పార్టీ వర్గాల సమాచారం.
శాటిలైట్ మ్యాపింగ్‌తో లెక్కలు ఫైనల్ :
ఏయే జిల్లాలో ఎన్ని ఎకరాల మేర భూమి సాగులో ఉన్నదో తేల్చిన తర్వాతే రైతుభరోసా సాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. రెండు వారాలుగా వివిధ ప్రాంతాల్లో సాగుభూముల విస్తీర్ణాన్ని లెక్క తేల్చే శాటిలైట్ మ్యాపింగ్ (Satellite Mapping) ప్రక్రియ జరుగుతూ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. సాగులో లేని భూములకు సాయం అందించడం ద్వారా ప్రయోజనం ఉండదనేది అధికారుల వాదన. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలనుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ఫామ్ హౌజ్‌లు, (Farm Houses) ఔటర్ రింగు రోడ్డుకు (ORR) ఆనుకుని ఉన్న భూములు రియల్ ఎస్టేట్‌గా మారిపోయినందున ప్రభుత్వం శాటిలైట్ ఇమేజింగ్‌పై దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కొంత సమయం పడుతుందని, అన్ని జిల్లాల్లోని సాగులో ఉన్న భూముల లెక్కలను తేల్చిన తర్వాత ఆ డేటాకు అనుగుణంగా ‘రైతుభరోసా’పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
‘నాలా’ కన్వర్షన్ లేని ఫామ్‌హౌజ్‌లు :
“ఫామ్ హౌజ్‌లన్నీ వ్యవసాయ భూముల్లోనే ఉన్నాయి. కొన్నిచోట్ల బంగళాలు, లగ్జరీ విల్లాలు వెలిశాయి. వాటికి కరెంటు కనెక్షన్ కూడా వ్యవసాయ కేటగిరీలోనిదే. ‘నాలా’ (Non-Agricultural Land Conversion) కన్వర్షన్ కాలేదు. దీంతో అవి రికార్డుల్లో సాగుభూములుగానే ఉన్నాయి. కానీ సాగులో మాత్రం లేవు. ఓఆర్ఆర్ సమీపంలోని కొన్ని భూములు కూడా వ్యవసాయ భూముల కేటగిరీలో ఉన్నా సేద్యం జరగడంలేదు. అందుకోసమే శాటిలైట్ మ్యాపింగ్. శాటిలైట్ ఇమేజ్‌లు రాగానే సాగుభూముల లెక్క తేలిపోతుంది. అప్పుడు రైతుభరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది” అని అగ్రికల్చర్ (Agriculture) డిపార్టుమెంటు వర్గాలు తెలిపాయి. గత సీజన్‌కు తొమ్మిది రోజుల్లోనే సుమారు 67 లక్షల మంది రైతులకు రూ. 8,284 కోట్ల మేర నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. సుమారు 1.38 కోట్ల ఎకరాలకు ఈ సాయం అందింది. ఈసారి ఎన్ని ఎకరాలకు అందుతుందనేది సస్పెన్స్.
జెడ్పీటీసీ ఎన్నికలతో లంకె? :
సర్పంచ్, వార్డు సభ్యుల్ని ఎన్నుకునే గ్రామపంచాయతీ ఎలక్షన్స్ పూర్తయినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పెండింగ్‌లో పడ్డాయి. పేదలకు అనేక రూపాల్లో సంక్షేమాన్ని అందిస్తున్నా ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని కాంగ్రెస్ డిజప్పాయింట్ అయింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి పాజిటివ్ రిజల్టు వస్తుందన్నది సందేహంగా మారింది. గ్రౌండ్‌ను రెడీ చేసుకున్న తర్వాత ఎలక్షన్ షెడ్యూలు ఖరారు చేయాలన్నది పార్టీ భావన. ఓటర్లను ఆకట్టుకోడానికి ‘రైతుభరోసా(Rythu Bharosa)’ను వినియోగించుకోవాలన్న ఆలోచన నెలకొన్నది. దీంతో జనవరి చివర్లో నిధులు ఇచ్చి ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలనే ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫిబ్రవరిలోగా ఎన్నికలు పెట్టకపోతే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ (ఏప్రిల్) అయ్యేవరకు సాధ్యం కాదనే వాదనా ఉన్నది. పరీక్షలు, సమ్మర్ హీట్ వీటన్నింటినీ బేరీజు వేసుకుని ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి తగినట్లుగా రైతుభరోసా నిధుల విడుదలపైనా క్లారిటీ వస్తుంది.
Read Also: భారత్ అణు శక్తికి స్ట్రాటజిక్ బూస్ట్.. ‘K-4’ మిసైల్ టెస్ట్ సక్సెస్.. విశేషాలివే!
Follow Us On: Youtube


