కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో భూ భారతి (Bhu Bharati Portal), మీసేవ పెండింగ్ లో ఉన్న భూ రిజిస్టేషన్ దరఖాస్తులు (Land Registration Applications) సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) ఆదేశించారు. ఈ మేరకు బుధవారం భూత్పూర్ మండలంలో పర్యటించి తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ముందుగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి, మీ సేవలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో విచారణ అవసరమైన దరఖాస్తులను వెంటనే పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాన్నారు.
మండలంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పురోగతిపై కూడా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించాలని అన్నారు. వారం రోజుల్లోగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ పూర్తి చేసి, వాటి డిజిటైజేషన్‌ను 100 శాతం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
భూత్పూర్ పీహెచ్సీని తనిఖి చేసిన కలెక్టర్
అనంతరం భూత్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను కలెక్టర్ కుష్బూ గుప్తా సందర్శించి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల వైద్య పరీక్షలకు సంబంధించి ఫాలోఅప్ కోసం రిజిస్టర్‌లో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రయోగశాలలో ప్రతిరోజూ పరీక్షల నివేదికలు సిద్ధం చేస్తున్నారా లేదా అని పరిశీలించి, ల్యాబ్ రికార్డులను తనిఖీ చేశారు.
అసాధారణ పరీక్ష ఫలితాలు వచ్చిన రోగులను వెంటనే సంప్రదించి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోజువారీ ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఓపీ రోజుకు సుమారు 40 నుంచి 50 మంది వరకు, సాధారణ ఓపీ 80 నుంచి 100 మంది వరకు ఉంటుందని వైద్యాధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ఆసుపత్రిలో అమలవుతున్న ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ)తో పాటు రొటీన్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రొటీన్ ఇమ్యూనైజేషన్ ప్రతి బుధవారం, శనివారం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు కలెక్టర్‌కు వివరించారు. మెడికల్ ఆఫీసర్ అబ్దుల్ రబ్ ఉన్నారు.

