కలం, వెబ్డెస్క్: దేశ రాజధానిలో రేపట్నుంచి మూడు రోజుల (ఈ నెల 26–28) పాటు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదవ జాతీయ సదస్సు (National conference) జరగనుంది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ వేదికగా జరిగే ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల(సీఎఎస్)తోపాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు. వీరితోపాటు పాలనలో కీలకపాత్ర పోషించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవుతారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడానికి ఈ సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు తీరును, భవిష్యత్ సవాళ్లను ఉమ్మడి ఎదుర్కోవడానికి కేంద్రం ఏటా ఈ సదస్సు జరుపుతోంది.


