కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు ఏ సంజీవ ముదిరాజ్ (Sanjeev Mudiraj) అన్నారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు బుధవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని అశోక్ టాకీస్ చౌరస్తా, గాంధీ విగ్రహం వద్ద డీసీసీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన కార్యక్రమం (Mahabubnagar Congress Protest) నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రజల తరఫున పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. దేశ యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన నీట్ పేపర్ లీక్ వంటి ఘటనలపై ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజల గొంతును అణచివేయాలని ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
రాజ్యాంగ పరిరక్షణ, విద్యార్థుల హక్కులు, సామాన్య ప్రజల న్యాయం కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజాస్వామ్య విలువలను గౌరవించి, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎ.పి. మిథున్ రెడ్డి , టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఎం. సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం. నర్సింహా రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, డివిజన్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, కార్పొరేటర్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, సెల్ చైర్మన్లు, అనుబంధ విభాగాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

