కలం, నిజామాబాద్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యల పై ఈనెల 27వ తేదీన “ఛలో పార్లమెంట్” (Chalo Parliament) కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర నాయకులు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ హైదర్ గూడలోని న్యూస్ సర్వీస్ సిండికేట్(NSS) లో జరిగిన మీడియా సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ లు ‘ఛలో పార్లమెంట్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుతున్నందున దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి, పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కరించాల్సిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్దరణ, జర్నలిస్టుల రక్షణకు పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయడం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జాతీయ మీడియా కమీషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాకు చట్టబద్దత వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధనకై 27వ తేదీన ఢిల్లీలోని పార్లమెంట్ (జంతర్ మంతర్) వద్ద ఒక రోజు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు రైలు ప్రయాణ చార్జీల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ దాదాపు 15 సంవత్సరాల పాటు కొనసాగిన రైల్వే రాయితీని కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సందర్బంగా నిలిపివేసిందని, ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్దరించకపోవడంతో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను పునరుద్దరించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మీడియా రంగం విస్తరించిన నేపథ్యంలో వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో “నేషనల్ మీడియా కమీషన్” ఏర్పాటు చేయాలని వారు కోరారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో అనేకమంది రిటైర్డ్, సీనియర్ జర్నలిస్టులకు ఎటువంటి ఆదాయ వనరులు లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని రాష్ట్రాలలో రిటైర్డ్ జర్నలిస్టులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ స్కీం అమలు చేస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో పెన్షన్ స్కీం లేకపోవడం వల్ల మిగతా రాష్ట్రాలలో ఈ స్కీం అమలు కావడం లేదని అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం ఉండేలా “జాతీయ పెన్షన్ పథకం” అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనేక రాష్ట్రాలలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అక్రమ కేసులు వంటి వాటిని అరికట్టేందుకు పార్లమెంట్ లో “జర్నలిస్టుల రక్షణ చట్టం” తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు పూర్తి స్థాయిలో చట్టబద్దత కల్పించాలని అన్నారు. అదేవిధంగా పాత్రికేయ సంఘాలకు, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూముల కేటాయింపును నిరాకరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించి, దేశవ్యాప్తంగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ డిమాండ్ల సాధనకై 27వ తేదీన జరిగే “ఛలో పార్లమెంట్” కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు, టీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులు పాల్గొంటారని, అదేవిధంగా ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) నాయకులు కూడా ధర్నాలో పాల్గొంటారని తెలిపారు.
ధర్నా అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. పాండురంగారవు, పి. అశోక్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, రంగారెడ్డి జిల్లా కో-కన్వీనర్ నంబి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

