కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ (Bangladesh)లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని అతికిరాతకంగా చంపి, మృతదేహాన్ని దహనం చేసిన ఘటన మరువక ముందే, రాజ్‌బారి జిల్లాలో మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు.
బంగ్లాదేశ్ (Bangladesh)లో అస్థిరత, మతపరమైన ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. మైమెన్‌సింగ్‌లో జరిగిన దారుణ హత్య మరువక ముందే, తాజాగా రాజ్‌బారి జిల్లాలో అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ (29) అనే హిందూ యువకుడిని మూకదాడి చేసి చంపడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి సమయంలో రాజ్‌బారి జిల్లాలోని పాంగ్షా ఉపజిల్లా, హోసైన్‌డంగా పాత మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు అమృత్ మండల్‌ను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం.
అమృత్ మండల్ వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో జనం అతడిపై దాడి చేశారని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్ర గాయాలతో పడి ఉన్న అమృత్‌ను పోలీసులు రక్షించి, పాంగ్షా ఉపజిల్లా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అమృత్ మండల్‌పై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.


