కరీంనగర్‌లో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar)లో మరో సంచలనాత్మక దోపిడీ (Robbery) ఘటన కలకలం రేపింది. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ నగర్‌లో నివసించే అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి మారణాయుధాలతో ప్రవేశించిన ముఠా భారీగా నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడీ ఇంకా సద్దుమణగకముందే మరోసారి దుండగులు రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక భగత్‌నగర్‌లో అర్ధరాత్రి అత్యంత దారుణంగా ఇంట్లోకి చొరబడిన దుండగులు.. వృద్ధ దంపతులను బంధించి రూ.21 లక్షల నగదు, 66 తులాల బంగారం, 10 తులాల వెండిని దోచుకెళ్లారు.

ముఖాలకు ముసుగులు ధరించిన వారు ప్రహరీ దూకి అర్ధరాత్రి ఇంటి సందులోని లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తున్న అజ్మత్ అలీ నోరు మూసేసి ఇంట్లోని ముగ్గురు మహిళల నోళ్లలో గుడ్డలు నొక్కి తుపాకులతో బెదిరించారు. అజ్మత్ అలీపై దాడికి కూడా పాల్పడ్డారు. చేతుల్లో డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరిస్తూ వృద్ధ దంపతులతో పాటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ గదిలో కట్టేశారు. ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే నిశ్శబ్దంగా బీభత్సం సృష్టించారు. బీరువాలు, అల్మారాలను చిందవందరగా గాలిస్తూ వాటిలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. బాధితుల మెడలో ఉన్న గొలుసులు, చేతి ఉంగరాలను కూడా బలవంతంగా లాక్కున్నారు. దోచుకున్న సొత్తుతో పాటు ఇంటి బయట పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను సైతం ఎత్తుకెళ్లి దుండగులు పరారయ్యారు.

దర్యాప్తు ముమ్మరం

ఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్ సీపీ గౌష్ ఆలం, అడిషనల్ సీపీ వెంకట రమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్ కుమార్, సీఐలు రాంచందర్ రావు, తిరుమల్, పుల్లయ్యలు పరిస్థితిని సమీక్షించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రలు, ఇతర భౌతిక ఆధారాలను సేకరించారు. చుట్టుపక్కల నివాసాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఘటనా స్థలంలో అగంతకులు వదిలివెళ్లిన ఒక తుపాకీని పరిశీలించగా అది టా య్ పిస్టల్ (టాయ్ పిస్టల్) గా గుర్తించారు. నిందితులను పట్టుకోవడానికి సిసిటివి ఫుటేజ్, మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా గాలింపు చర్యలు వేగవంతం చేసింది. ఇటీవల పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ చోరీ కేసు విచారణ దశలో ఉండగానే ఇప్పుడు ఏకంగా నివాస గృహంలోకి చొరబడి ఈ స్థాయిలో దోపిడీ జరగడం నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

పక్కా స్కెచ్‌తోనే దోపిడీ?

దోపిడీ జరిగిన తీరును బట్టి చూస్తే నేరస్థులకు అజ్మత్ అలీ ఇల్లు ఆ ప్రాంగణంపై పూర్తి అవగాహన ఉన్నట్లు స్పష్టమవుతోంది. అజ్మత్ అలీ రోజూ ఇంటి సందులో లైట్ ఆపేసి లోపలికి వెళ్తారనే విషయాన్ని గమనించిన దొంగలు ఆ సందులోనే దాక్కుని దాడి చేశారు. దోపిడీ అనంతరం అజ్మత్ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులను చోరీ చేసి బైపాస్ రోడ్డు మీదుగా పారిపోయినట్లు సిసిటివి (CC TV) ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే దుండగలు భగత్ నగర్ లోని అజ్మత్ ఇంటికి ఎలా వచ్చారు? వాహనంలో వచ్చారా? నడుచుకుంటూ వచ్చారా? అనేది ఇంకా సందిగ్దంలోనే ఉంది. స్థానికంగా ఆ ప్రాంతంలో సరైన సిసి కెమెరా ఫుటేజీలో లభ్యం కాలేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల అసలే పని చేయకపోవడంతో దుండగుల కదలికలు కష్టంగా మారాయి.

కుటుంబ తగాదాలే కారణమా?.. యూపీ మీరట్‌కు లింక్..

పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో విచారిస్తున్నారు. అజ్మత్ అలీకి భగత్ నగర్, ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తులు, కాంప్లెక్సులు ఉన్నాయి. ఆయన తన ఆస్తులను కూతుళ్లకు కూడా పంచి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయన పెద్ద అల్లుడు కరీంనగర్‌లో కొంతకాలం క్లాత్ స్టోర్ నడిపి ఇటీవల కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెళ్లిపోయాడని సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన అల్లుడి బంధువుల్లో ఒకరికి నేర చరిత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. దోపిడీ ముఠా కూడా హిందీ మాట్లాడటం, అల్లుడిది మీరట్ కావడం వల్ల అక్కడ నుంచే ప్రత్యేక ముఠాను పంపించారా? ఇది మామూలు దోపిడీయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దోపిడీ ఘటన వెనుక కుటుంబ తగాదాలు లేదా బంధువుల హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ అదే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వృద్ధుడైన అజ్మత్ అలీ, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉంటున్నారనే విషయం తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

హుజురాబాద్ సమీపంలో బైక్‌లు లభ్యం

దొంగల ముఠా రెండు బైకులను ఎత్తుకెళ్లి వరంగల్ వైపు పారిపోయినట్లు కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఒక పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకుని హుజూరాబాద్ మీదుగా వెళ్లినట్లు సీసీటీవీ (CCTV) ఫుటేజీలో రికార్డయింది. వరంగల్, ఖాజీపేట తదితర ప్రాంతాల్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల ప్రకారం 6 నుండి 8 మంది దోపిడీలో పాల్గొనగా సీసీ కెమెరాల్లో బైకులపై 5 గురు మాత్రమే కనిపించారు. పెట్రోల్ బంక్‌లో మొదటి బైకుకు పెట్రోల్ పోయించుకుని, రెండో బైక్ ట్యాంక్ తాళం చెవి లేకపోవడంతో పెట్రోల్ పోయించుకోకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత హుజూరాబాద్ సమీపంలోని పెద్ద పాపయ్యపల్లి వద్ద ఆ రెండు బైకులను వదిలేసి పరారయ్యారు. అక్కడ నుండి వీరు లారీలు లేదా వేరే వాహనాల్లో పారిపోయి ఉండవచ్చని ఆరా తీస్తున్నారు.

పోలీసులకు సవాల్

మే 3న కరీంనగర్ జ్యోతి నగర్ PMJ జ్యువెలరీ షాపులో జరిగిన ‘సుబోధ్ గ్యాంగ్’ రాబరీ తరహాలోనే అజ్మత్ అలీ అల్లుడు ఈ ప్లాన్ చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో నైట్ రూట్ ఆఫీసర్ , నైట్ డ్యూటీ ఆఫీసర్, నైట్ సూపర్ వైజింగ్ ఆఫీసర్ లతో పోలీసులు గస్తీ, తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఇలా మారణాయుధాలతో వచ్చి దర్జాగా దోపిడీ చేసి వెళ్లడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అతి త్వరలో ఈ కేసును చేధిస్తామని పోలీసులు బలంగా చెబుతున్నప్పటికీ వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>