కలం, కరీంనగర్ బ్యూరో: అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు (KTR) రైతులు, వారి సమస్యలు గుర్తుకు రాలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri) విమర్శించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా నంది మేడారం, రచ్చపల్లి గ్రామాలలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ రైతుల పరామర్శ పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని మంత్రి ప్రశ్నించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారికి అండగా నిలిచి భరోసా కల్పించాల్సిన బాధ్యతను ప్రతిపక్షాలు విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. నంది మేడారం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో గ్రామస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

