కాంగ్రెస్ ‘420’ హామీలు ఏమాయే?.. జగిత్యాలలో BRS ఫైర్

​కలం, జగిత్యాల: జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద కాలేజీ విద్యార్థులతో కలసి బీఆర్ఎస్ నేతలు బృహత్ నిరసన (BRS Protest) ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు, విద్యార్థులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. జీవన్ రెడ్డి, శాసనమండలి ఉపనాయకులు ఎల్. రమణ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ లు కాంగ్రెస్ ​ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు. విద్యాసంస్థలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం, నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సరైన జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ అమలును గాలికొదిలేయడమే కాకుండా, విద్యార్థినులకు ఇస్తామన్న ఉచిత స్కూటీల పథకాన్ని పూర్తిగా పక్కనబెట్టారని మండిపడ్డారు.

విద్యార్థుల వెంటే బీఆర్‌ఎస్..

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలపడం అభినందనీయమని పేర్కొన్నారు.సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాసాగర్ రావు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

శనివారం నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఉన్నత అధికారులగా రాణించాలని విద్యాసాగర్ రావు ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ​విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, వేలాది మంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>