‘సంచులు మోసిన జాతి మాది కాదు’.. సీఎంకు కేటీఆర్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రెండే జాతులున్నాయని.. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, ఇంకోటి తెలంగాణకు ద్రోహం చేసే జాతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరు తెలంగాణ సాధించారో, ఎవరు తెలంగాణను వంచించారో ప్రజలకు బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రైతు సదస్సులో కేటీఆర్ పాల్గొని రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుపెట్టిన జాతి తమది కాదని అన్నారు. ‘సమైక్యవాదుల సంచులు మోసిన జాతి మాది కాదు.. ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన జాతి మాది కాదు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలోనూ తరిమికొడతారు..

దేశ రాజధాని ఢిల్లీలో యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు, ఉద్యమాలు త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతాయని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దేశ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలోనూ తరిమికొడతారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడు దొరికితే యువత పొట్టు పొట్టు కొట్టేటట్టు పరిస్థితి ఉందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో యువత మరోసారి తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. రాష్ట్ర యువత ఆకాంక్షలను తుంగలో తొక్కి, రెండు లక్షల ఉద్యోగాలు, యువత డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం చేసిందని.. దీనిపై తెలంగాణ యువత కూడా నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదని విమర్శించారు. యువ సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించామన్నారు.

అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్..

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రైతు డిక్లరేషన్ పేరుతో 34 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా నెరవేర్చలేదన్నారు. “మోసపోతే గోసపడుతాం” అని కేసీఆర్ ఆనాడే చెప్పారని, రాష్ట్రంలో ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతాంగం అష్టకష్టాలు పడుతోందన్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

4 విడతల రైతు బంధు ఎగ్గొట్టారు..

పంటలు కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 8 గంటలపాటు ధర్నా చేసినా ప్రభుత్వం మనసు కరగలేదని విమర్శించారు. నాలుగు విడతల రైతుబంధు నిధులను కూడా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని విమర్శించారు. రాష్ట్రంలో కరువుకు శాశ్వత పరిష్కారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎత్తిపోసే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరాన్ని వినియోగించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>