కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వినియోగంపై భారత రక్షణ శాఖ కఠినంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో Indian Army మరోసారి సైన్యంలోని సిబ్బందికి సామాజిక మాధ్యమాల (Social Media) వినియోగంపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జవాన్లు, సైనిక అధికారులు ఇన్ స్టాగ్రామ్ ను చూడడానికి అనుమతి ఇచ్చింది. అయితే.. ఇన్ స్టా, ఎక్స్ లో ఎలాంటి వ్యాఖ్యలు తెలపకూడదని, కేవలం పర్యవేక్షణ ప్రయోజనాల కోసమే వినియోగించాలని సూచించింది.
ఈ అప్లికేషన్లలో పోస్టింగ్స్, లైకులు, వ్యాఖ్యలపై పూర్తి నిషేధం విధించింది. భద్రత, సున్నితమైన సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని.. జాతీయ భద్రత కోసం మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఆర్మీ స్పష్టం చేసింది. అలాగే, సోషల్ మీడియా వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగుతుందని ఆర్మీ పేర్కొంది. డిజిటల్ అవగాహనతో పాటు దేశ భద్రతకు ముప్పు తలెత్తకుండా సైనికులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
కాగా, హనీట్రాప్, డబ్బుల ఆశ చూపి సమాచారాన్ని దొంగిలించే ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రక్షణ శాఖ సామాజిక మాధ్యమాల వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే 2022లో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సహా మొత్తం 89 మొబైల్ అప్లికేషన్లను సిబ్బంది వాడకుండా ఆర్మీ బ్యాన్ విధించింది. తరువాత పరిస్థితుల ఆధారంగా కొన్ని సడలింపులు తీసుకొచ్చింది. సైన్యంలోని సిబ్బందికి ప్రస్తుతం ఫేస్ బుక్, యూ ట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్, వాట్సప్ వంటి యాప్ లను పాక్షికంగా వినియోగించుకునే వెసులుబాటును కల్పిస్తూ Indian Army కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.


