కలం, వెబ్ డెస్క్ : వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ యూజర్స్ భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఒక్క నెలలోనే 91 లక్షల భారీతీయుల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ (WhatsApp Ban) చేసింది. భారతదేశంలో సైబర్ మోసాలు, స్పామ్, నకిలీ కార్యకలాపాలను అరికట్టేందుకు వాట్సాప్ కఠిన చర్యలు చేపట్టింది. 2025 అక్టోబర్ ఒక్క నెలలోనే 91,26,723 భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ వివరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు–2021 ప్రకారం విడుదల చేసిన తాజా ట్రాన్స్పరెన్సీ నివేదికలో ఉన్నాయి.
ఈ నివేదిక 2025 అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు జరిగిన చర్యలను కవర్ చేస్తుంది. వినియోగదారుల గోప్యత, భద్రతే ప్రధాన లక్ష్యంగా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో పాటు మోసాలను ముందుగానే గుర్తించే ఆధునిక సాంకేతిక వ్యవస్థలను వాట్సాప్ వినియోగిస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ నెలలో భారతదేశం నుంచి మొత్తం 35,665 ఫిర్యాదులు అందాయని, వీటిలో 1,060 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. ఈ ఫిర్యాదుల్లో WhatsApp Ban అప్పీల్స్, అకౌంట్ సపోర్ట్, ఇతర సహాయక అంశాలు ఉన్నాయి. అలాగే గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC) నుంచి వచ్చిన 16 ఆదేశాలను పూర్తిగా అమలు చేసినట్లు వాట్సాప్ స్పష్టం చేసింది.
యూజర్ ఫిర్యాదులతో పాటు, అకౌంట్ నమోదు దశలోనే లేదా మెసేజింగ్ సమయంలో అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించే అబ్యూస్ డిటెక్షన్ వ్యవస్థ ద్వారా కూడా భారీ సంఖ్యలో అకౌంట్లను గుర్తించి బ్యాన్ చేసినట్లు సంస్థ తెలిపింది. స్పామ్, స్కామ్‌లు, తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతాయని వాట్సాప్ వెల్లడించింది. వినియోగదారులు అనుమానాస్పద సందేశాలను వెంటనే రిపోర్ట్ చేయాలని, అధికారిక వాట్సాప్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.
Read Also: టాలీవుడ్లో సత్తా చాటిన చిన్న సినిమాలు.. 2025లో వీటిదే హవా
Follow Us On: X(Twitter)


