కలం వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఫిరాయింపు(Party Defection) ఎమ్మెల్యేల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేనని, మిగతా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియని వ్యాఖ్యానించారు. తాజాగా మరో ఫిరాయింపు ఎమ్మెల్యే తాను కాంగ్రెస్ చేరాల్సి వచ్చిందని ఓ బహిరంగ వేదికపై చెప్పారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో జగిత్యాల(Jagityal) ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar) కూడా ఉన్నారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినట్లు బహిరంగంగా అంగీకరించారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నందుకే తన నియోజకవర్గంలో నిధులు వస్తున్నాయని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడారు. కొందరు సంజయ్ కుమార్ ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి పోయాడని మాట్లాడుతున్నారని, పోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని చెప్పినందుకే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వం కలిసి ఉన్నందుకే నియోజకవర్గ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నిన్న దానం.. నేడు సంజయ్.. ఇలా ఒక్కొక్కరు పార్టీ మారినట్లు బహిరంగంగానే అంగీకరిస్తుండటంతో ఫిరాయింపుల కేసులో ఏం జరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.


