కలం వెబ్ డెస్క్ : విశాఖలోని రుషికొండ భవనాల(Rushikonda buildings)పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(BJP MLA Vishnukumar Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల కమిటీ రుషికొండపై తమను సంప్రదించలేదని చెప్పారు. రుషికొండ భవనాలపై తమ అభిప్రాయాలను తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఆరేళ్లుగా రుషికొండ మూసేశారని విష్ణుకుమార్ అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయం తప్పకుండా తీసుకోవాలన్నారు.
రుషికొండను ఆదాయ వనరుల కిందే చూస్తే సమస్యలు వస్తాయని విష్ణు కుమార్ అన్నారు. టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా మార్చడం, ఎగ్జిబిషన్ కేంద్రంగా మార్చడం సామాన్యుడి అభిప్రాయమని తెలిపారు. విశాఖ(Vizag)ను ఐటీ హబ్‌గానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. స్టార్ హోటళ్లకు వెళ్లి తింటే జేబులు ఖాళీ అవుతాయని, హోటళ్లకు కేటాయించడమంటే సామాన్యుడికి దూరం చేయడమేనని స్పష్టం చేశారు.


