కలం వెబ్ డెస్క్ : కర్ణాటక(Karnataka)లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు(Bengaluru) నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సును ఓ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 17 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలోని బెంగళూరు-హుబ్బళ్లి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకొని, ప్రయాణికులు బయటపడే అవకాశం లేకుండా పోయింది. 9 మంది ప్రయాణికులు అతి కష్టం మీద బస్సులో నుంచి బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మృతుల గుర్తింపు ప్రక్రియ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పండుగ సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిరియూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


