epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అబుదాబీలో తెలంగాణ కార్మికుడి భిక్షాటన

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు (Telangana Worker) అబుదాబీలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. పని దొరక్క.. పైసలు లేక .. తినడానికి తిండిలేక రోడ్ల మీద యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబసభ్యులకు దూరమైన ఆ కార్మికుడు తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆదుకోవాలని.. ఇండియాకు తీసుకురావాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని పెరుమల్ల గ్రామానికి చెందిన కార్మికుడు (Telangana Worker) మాలోత్ శ్రీరాం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. నవంబర్ 11, 2025న క్లీనర్ వీసాపై అతడు అబుదాబికి వెళ్లాడు. వరల్డ్ స్టార్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కంపెనీలో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే శ్రీరామ్ దుబాయ్‌కి వెళ్లిన రెండురోజులకే అక్కడ ఉండలేకపోయాడు. కుటుంబసభ్యులకు దూరం కావడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్టు సమాచారం.

నవంబర్ 13న అతడు కంపెనీ లేబర్ క్యాంప్ నుంచి వెళ్లిపోయాడు. దాదాపు నెల రోజుల తర్వాత అతడిని గుర్తించి క్యాంపుకు తిరిగి తీసుకొచ్చారు. కానీ కంపెనీ మేనేజ్‌మెంట్ అతడిని మళ్లీ క్యాంపులోకి అనుమతించలేదని తెలుస్తోంది. దీంతో అతడు వీధులపై భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. కంపెనీ మేనేజ్‌మెంట్ అతడిపై ‘అబ్‌స్కాండింగ్’ కేసు నమోదు చేసిందని, అతడిని స్వదేశానికి పంపించడానికి 4,500 దిర్హామ్‌లు (సుమారు రూ. 1.10 లక్షలు) పెనాల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తోందని కుటుంబ‌సభ్యులు చెబుతున్నారు. దీంతో శ్రీరాం కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

శ్రీరాం భార్య సునీత, హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతి పత్రం సమర్పించింది. అత్యవసర సహాయం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కాపీలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎం మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంధ భీమ్ రెడ్డికి కూడా సమర్పించారు. ప్రభుత్వం అతడిని స్వదేశానికి తీసుకురావాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>