కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్త సమ్మె (Rented Vehicles Strike)కు దిగారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిపడిన సుమారు రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం మీడియా పాయింట్ వద్ద వాహన యజమానులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమ్మె ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్న 5 వేలకు పైగా అద్దె వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ప్రస్తుతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి నెలా చెల్లించే అద్దెను రూ.34 వేల నుండి రూ.55 వేలకు పెంచాలని యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ప్రతి నెల 5వ తేదీ నుండి 10వ తేదీ లోపు అద్దె బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గత 18 నెలలుగా బిల్లులు రాకపోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్, నెలవారీ ఈఎంఐలు (EMI) చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇందుకోసం తమ సొంత డబ్బులను ఖర్చు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకుల నుండి నోటీసులు వస్తున్నాయని, వాహనాలను జప్తు చేసే పరిస్థితి నెలకొందని యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

