కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి నాణ్యమైన మానవ వనరులతోనే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యా, సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశం సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గ పరిధిలో చేపట్టిన మూడు మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులను వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. జిల్లాలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పనులను వేగవంతం చేయాలని, జనవరి 15లోపు ఇంటర్ విద్యా సంస్థల మరమ్మతులు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తేల్చి చెప్పారు. గురుకులాలకు డైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేస్తోందని, పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. విద్యా సంస్థల తనిఖీల్లో నిర్లక్ష్యం వహించినా లేదా తప్పుడు నివేదికలు ఇచ్చినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలపై తప్పనిసరిగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని, ఇందిరా గిరి జల వికాసం కింద పోడు పట్టాలు పొందిన రైతులకు సోలార్ పంపు సెట్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ కల్పించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలని, ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Anudeep Durishetty) మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో లక్షా 73 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఎఫ్.ఆర్.ఎస్ హాజరు నమోదులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని వివరించారు. విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంచేందుకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐటిడిఏ పిఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: శివధర్‌రెడ్డి స్థానంలో కొత్త డీజీపీ? నయా జాబితాపై ఉత్కంఠ!!
Follow Us On: X(Twitter)


