కలం, వెబ్డెస్క్: ముంబైని కాపాడడానికే తాము మళ్లీ కలిశామని ఠాక్రే సోదరులు (Thackeray Brothers) అన్నారు. 20 ఏళ్ల వైరానికి, ఎడబాటుకు స్వస్తి పలుకుతూ సోదరులు, శివసేన(ఉద్ధవ్) పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) అధినేత రాజ్ ఠాక్రే(Raj Thackeray) బుధవారం చేతులు కలిపారు. అనంతరం కుటుంబసభ్యులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము కలవడం చరిత్రలో నిలిచిపోదగిన రోజని వారు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రను ఠాక్రేలు మాత్రమే ఏలగలరని, అభివృద్ధి వైపు నడిపించగలరని అన్నారు. రాష్ట్రాన్ని, ముంబైని కాపాడడానికే తాము మళ్లీ కలిసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (MBC) ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని వెల్లడించారు. ముంబై మేయర్ పీఠంపై మరాఠీ వ్యక్తి ఉండాలనేదే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నామని వారు తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ కలసినట్లుంది: ఫడ్నవిస్
ఠాక్రే సోదరులు (Thackeray brothers) కలవడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యంగ్యంగా స్పందించారు. వాళ్లిద్దరూ కలవడం రష్యా, ఉక్రెయిన్ కలసినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఠాక్రే సోదరులు కలవడం ఒక డ్రామా అని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉనికిని, రాజకీయ చరిష్మాను కోల్పోయే దశకు చేరుకున్నాయని, ఇప్పుడు కలసి ఏం చేస్తాయని ప్రశ్నించారు. ఇప్పటికే వాటి ఓటు బ్యాంకు చెల్లాచెదురైందన్నారు. రాజకీయంగా కనుమరుగు కాకుండా ఉండడానికే ఠాక్రే సోదరులు కలసినట్లు ఉందని విమర్శించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి కారణంగా మహారాష్ట్రలో తమ ఉనికి పూర్తిగా అంతమవుతుందనే భయంతోనే ఠాక్రే సోదరులు జట్టుకట్టారని వ్యాఖ్యానించారు.
Read Also: హీరో విజయ్ కి మలేషియా పోలీసుల వార్నింగ్.. ఎందుకంటే?
Follow Us On: X(Twitter)


