కలం, వెబ్ డెస్క్ : హుస్నాబాద్(Husnabad) నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) క్షేత్రస్థాయి యంత్రాంగంతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అన్ని శాఖల అధికారులతో ముఖాముఖి చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్య వైద్యం వ్యవసాయం మౌలిక సదుపాయాలు రోడ్లు విద్యుత్, ఇరిగేషన్ వంటి ప్రధాన రంగాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ప్రభుత్వ సేవలు అత్యంత పారదర్శకంగా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అందాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లు సమర్థవంతంగా పనిచేయాలని సిబ్బంది కొరతపై ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంఈవోల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి నియోజకవర్గంలోని 43 రైతు వేదికలను బలోపేతం చేస్తూ మండల వ్యవసాయ అధికారులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
గత పదేళ్ల పాలనలో నియోజకవర్గానికి కనీసం 250 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా రాలేదని ఈ ఏడాది తాము ఏకంగా 3500 ఇందిరమ్మ ఇళ్లను(Indiramma Indlu) మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని నిర్మాణం పూర్తయిన దశల వారీగా వారం రోజుల్లోనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతం కావడంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రత్యేక వెటర్నరీ స్కీమ్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని చారిత్రక సర్వాయి పాపన్న కోట అభివృద్ధి మహా సముద్రం గండి ఎల్లమ్మ చెరువు మరియు కొత్త చెరువు సుందరీకరణ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. క్షేత్రస్థాయిలో గ్రామ కార్యదర్శులు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు, హెడ్ మాస్టర్ల నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి సమస్యలన్నింటినీ టార్గెట్ గా పెట్టుకుని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Read Also: సర్పంచ్‌లకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
Follow Us On: Youtube


