కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం వల్ల భద్రాచలానికి ఎలాంటి ప్రమాదం లేదని.. పోలవరం ప్రాజెక్టు వల్లే పెను ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ఎత్తు పెంచడం వల్లే ఈ ప్రమాదం ఉందన్నారు. దీనికోసం ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపారని కేటీఆర్ గుర్తు చేశారు. పోలవరం గురించి గట్టిగా మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు మాత్రమేనని కేటీఆర్ ఆరోపించారు. రోజుకు 2 టీఎంసీలు ఎత్తితే ప్రాజెక్టులన్నీ నిండుతాయన్నారు. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి మేడిగడ్డకు ఏమీ కాలేదని ఆయన గుర్తు చేశారు.
247 టీఎంసీలు తట్టుకున్న మేడిగడ్డ 9 టీఎంసీలను తట్టుకోలేదా ? అని ప్రశ్నించారు. రైతులు పంటల కోసం ఆందోళన పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పంపులు ఆన్ చేయకుండా ప్రతిపక్షాలపై రంకలేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. తమ మీద కక్ష్య ఉంటే బూతులు తిట్టండి.. కానీ రైతుల నోట్లో మన్ను కొట్టొద్దని ఆయన కోరారు.

