కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ తదితర కార్యక్రమాల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), సూపర్వైజర్లు, రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబం నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా స్వీకరించాలని, ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో అర్బన్ తహసీల్దార్ రాజు, కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ రఫ్ఫూ తదితరులు పాల్గొన్నారు.

