TRS పై BRS సైలెన్స్​.. రీజన్​ అదేనా..?

కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై టీఆర్ఎస్ (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా వారి నుంచి కౌంటర్లు కరువయ్యాయి. కొన్ని నెలలుగా ఆమె ఏ ఆరోపణలు చేసినా వీరిద్దరూ మౌనంగానే ఉంటున్నారు. ఒక్క సందర్భంలో మాత్రం ‘ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా’ అంటూ హరీశ్‌రావు ఒక్క వాక్యంతోనే సరిపెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీపైనా సందర్భం వచ్చినప్పుడల్లా కవిత విరుచుకుపడుతున్నారు.

కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా సైలెంట్‌గానే ఉండిపోయారు. ఒకవైపు వ్యక్తిగతంగానూ.. మరోవైపు పార్టీపైనా ఎంతటి తీవ్ర ఆరోపణలు చేసినా కౌంటర్లు లేకపోవడంతో ఇది వ్యూహాత్మక ఎత్తుగడా?.. లేక మరింత పెద్ద ఇష్యూగా మారుతుందేమోననే ఆందోళనా?.. లేక ఆరోపణలకు అర్ధాంగీకారమా?.. అనే ప్రశ్నలు బీఆర్ఎస్ కార్యకర్తల్లో చర్చకు వస్తున్నాయి. కవిత వ్యాఖ్యలకు ఎందుకు బీఆర్ఎస్ సమాధానం ఇవ్వడంలేదన్నది ఆ పార్టీలోని నేతల్లోనూ డిస్కస్ జరుగుతున్నది.

కవితపై బీఆర్ఎస్ వైఖరిపైనే డౌట్స్!

కవిత చేస్తున్న కామెంట్లు అటు పార్టీకి, ఇటు వ్యక్తిగత ఇమేజ్‌కు ఇబ్బందికరంగా ఉన్నా ఎందుకు కేటీఆర్, హరీశ్‌రావు మౌనంగా ఉంటున్నారన్నది బీఆర్ఎస్‌ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. కుటుంబ ప్రతిష్టను సైతం మసకబారుస్తున్నారని, కొన్ని నెలలుగా కౌంటర్ ఇవ్వనందునే ఆమె పదేపదే కామెంట్లు చేస్తున్నారన్నది శ్రేణుల అభిప్రాయం. “పార్టీలో అవినీతి దున్నపోతులు ఉన్నారు. వాళ్ల వల్లే ఉద్యమ పార్టీ దారి తప్పింది. పదేండ్ల పాలనలో జరిగిన అన్యాయాలకు నేనూ బాధ్యత తీసుకుంటాను. ఆంధ్రా పెట్టుబడిదారుల నుంచి క్విట్ ప్రో కో పద్ధతిలో రూ. 1,400 కోట్లు పార్టీకి ఫండ్‌గా వచ్చింది..” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌లోని అంతర్గత సంక్షోభాన్ని వెలుగులోకి తెచ్చినట్లయింది.

నేరుగా కేటీఆర్, హరీశ్రావు పేర్లను ప్రస్తావిస్తూనే ఆమె ఈ ఆరోపణలు చేశారు. ‘‘ప్రజా సమస్యలపై నేను ఒంటరిగా పోరాటం చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెట్టాలని అవినీతి దున్నపోతులు హరీశ్రావు, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. పైగా ఈయనకు (హరీశ్కు) ఇంకా మూడు నెలలు ఇరిగేషన్ మినిస్ట్రీ ఇవ్వాల్నట. తిన్నది సరిపోతలేదా బాబూ! పెద్దమనిషి (కేసీఆర్)కి అంటించిన అవినీతి మరకలు సరిపోవడం లేదా?” అంటూ కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వీళ్లిద్దరూ దున్నపోతుల్లా తయారై… ప్రజల ఇష్యులను పక్కనబెట్టారని, అవినీతి ఇష్యూల్లో మునిగితేలుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషించారని ఆమె దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఆర్థిక వ్యవహారాలపై ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కుమార్తెనే ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతున్నది.

కేటీఆర్, హరీశ్​ పై అవినీతి ఆరోపణలు

– జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన కవిత.. తన సొంత అన్న కేటీఆర్‌ను వివాదంలోకి లాగారు. హైదరాబాద్లో హుస్సేన్‌సాగర్ సమీపంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అప్పటి పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ కల్పించిన సహకారానికి ప్రతిఫలంగానే ఆ ఫామ్‌హౌస్‌ను కేటీఆర్కు వ్యాపారవేత్త ప్రదీప్‌రెడ్డి ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు.

– హరీశ్‌రావును ఉద్దేశిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును పోగేసుకున్నారని, ఆ కరప్షన్ మచ్చను కేసీఆర్‌కు అంటించారని కవిత ఆరోపించారు. కాళేశ్వరం అవినీతికి మాజీ మంత్రి హరీశ్‌రావే ప్రధాన బాధ్యుడని, సీబీఐ విచారణ వరకు వెళ్లడానికి కూడా ఆయన వ్యవహారశైలే కారణమన్నారు.

– ఇంతకాలం ప్రత్యర్థి పార్టీలే ఈ ఆరోపణలు చేయగా.. ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కూడా చేయడం వాటికి బలం చేకూర్చినట్లయింది. పదేండ్ల పాలననే ప్రశ్నార్థకం చేసేలా ఉన్న ఆ ఆరోపణలు బీఆర్ఎస్‌ ఇమేజ్‌కు ఇబ్బందికరంగా తయారయ్యాయి.

కాంగ్రెస్ మీద దూకుడు.. కవిత విషయంలో నో!

రాష్ట్ర ప్రభుత్వంమీదా, ముఖ్యమంత్రిమీదా, మంత్రులమీదా, కాంగ్రెస్ పార్టీపైనా కేటీఆర్, హరీశ్‌రావు దూకుడు ప్రదర్శిస్తున్నా.. కవిత ఆరోపణలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఈ విషయంలో అంటీముట్టనట్లుగా ఉండడం కొత్త సందేహాలకు తావిచ్చినట్లవుతున్నది. ఇప్పటికే కవిత కామెంట్లతో బీఆర్ఎస్కు చాలా డ్యామేజ్ జరుగుతున్నదనే అభిప్రాయం కేడర్‌లో, జిల్లా స్థాయిలో నాయకుల్లో బలంగా నెలకొన్నది. పార్టీ తరఫున లేదా అగ్రనేతల నుంచి రియాక్షన్ లేకపోవడం మరింత చేటు చేస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి.

బీఆర్ఎస్‌లోని అంతర్గత విభేదాలే ఇందుకు కారణమని, పార్టీ చరిత్రనే ప్రశ్నార్థకం చేసేలా కవిత ఆరోపణలు ఉన్నాయని, వీటికి కౌంటర్ ఇవ్వకపోవడం పార్టీకి రాబోయే రోజుల్లో చాలా నష్టమన్నది వారి వాదన. ప్రారంభంలోనే కవితను కంట్రోల్ చేయకపోవడం వల్లే పరిస్థితి ఈ స్థాయికి దారితీసిందని, ఇప్పటికైనా నియంత్రించకపోతే ఇంకా నష్టం జరుగుతుందని వారు అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేసినప్పుడు సవాళ్లు విసిరే కేటీఆర్, హరీశ్రావు.. కవిత విషయంలో భిన్నంగా వ్యవహరించడం గులాబీ కేడర్‌కు మింగుడుపడడంలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>