కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి కల్పతరువుగా ఆవిర్బవించిన రామగుండం (Ramagundam) ఎరువుల కర్మాగారానికి మరోసారి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అమ్మోనియం పైప్ లైన్ లీకేజీతో ఎరువుల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. ప్లాంట్‌లో తలెత్తిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా యాజమాన్యం తాత్కాలికంగా షట్‌డౌన్ (ఉత్పత్తి నిలిపివేత) ప్రకటించింది. బుధవారం రాత్రి జరిగిన సంఘటన కారణంగా అప్రమత్తమైన ఇంజనీరింగ్ విభాగం అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా ప్లాంట్ నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్లాంట్ పునరుద్దరణకు మరో పది రోజులు పట్టే అవకాశముండగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పీక్ స్టేజీలో యూరియా కొరత తీవ్రం కానుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక సమస్యలు అమ్మోనియం గ్యాస్ కొరత కారణంగా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్లాంట్ తరచూ షట్ డౌన్ అవుతోంది. గతంలో స్టీమ్ పైప్‌లైన్ పగిలిపోవడం, అమ్మోనియా గ్యాస్ లీకేజీలు గ్యాస్ కొరత వంటి కారణాల వల్ల యూరియా ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.. పశ్చిమాసియాలో ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ద ప్రభావం యూరియా ఉత్పత్తిపై చూపిన విషయం తెలిసిందే.. ఫలితంగా ప్రస్తుతం గ్యాస్ ఆధారిత రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) లో యూరియా ఉత్పత్తి సగానికి పడిపోయింది. నాచురల్ గ్యాస్ సప్లై తగ్గిపోవడంతో ఆ మేరకు యూరియా ఉత్పత్తిని తగ్గించారు.
పశ్చిమాసియా దేశాల నుంచే ఇక్కడకు గ్యాస్ సరఫరా అవుతోంది. ఈ పరిశ్రమకు రోజుకు 2 మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ మీటర్ల రీగ్యాసీఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్‌ఎల్‌ఎన్‌జీ)ను వినియోగిస్తున్నారు. ఖతార్ నుంచి ఆర్‌ఎల్‌ఎన్‌జీని గుజరాత్‌లోని దహేజ టర్మినల్‌కు నౌకల ద్వారా తీసుకొస్తారు. అక్కడి నుంచి పెట్రోనెట్, ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్ ద్వారా గ్యాస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) పైప్‌లైన్ ద్వారా కాకినాడకు సరఫరా చేస్తుంది. అక్కడి నుంచి మల్లవరం – భోపాల్- బిల్వార గ్యాస్ పైప్‌లైన్ ద్వారా ఆర్ఎఫ్‌సీఎల్ కు గ్యాస్ సరఫరా అవుతుంది. కాగా ఖతార్‌లో ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి నిలిపివేయడం, నౌకల ద్వారా సరఫరా నిలిచిపోవడంతో అప్పుడు గ్యాస్ కొరత ఏర్పడింది.
ఆర్ఎఫ్‌సీఎల్ లో యూరియా ఉత్పత్తికి, 33 మెగా వాట్ల క్యాప్టివ్ పవర్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 2 మెట్రిక్ మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. ఇప్పటికే విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే యూరియా రవాణాకు విఘాతం ఏర్పడింది. దీనికి తోడు పరిశ్రమ నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరా నిలిపివేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి విద్యుదుత్పాదక కేంద్రం కూడా గ్యాస్ ఆధారంగానే నడుస్తోంది.
ఉత్పత్తిపై ప్రభావం?
రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా వార్షిక ఉత్పత్తి టార్గెట్ 12.7 లక్షల టన్నులు. యూరియా ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం రైతులపై పడే అవకాశం ఉంది. యేటా ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో 11 రాష్ట్రానికే కేటాస్తున్నారు. ఇక్కడ యూరియా ఉత్పత్తి తగ్గితే దీనిప్రభావం ప్రథమంగా రాష్ట్ర రైతాంగంపైనే పడనున్నది. రెండు మూడేళ్లుగా ప్రతి యేడాది మూడు నుంచి నాలుగు నెలల పాటు సాంకేతిక సమస్యల పేరుతో ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్లాంట్ పదే పదే మూతపడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి నారుమళ్లు వేసుకుంటున్న దశలో ఎరువులు వేసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో యూరియా కొరత తీవ్రమైతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది.
ఏడు రాష్ట్రాలకు యూరియా సరఫరా
తెలంగాణలోని రామగుండం ఆర్ఎఫ్ సిఎల్ కర్మాగారం ఏడు రాష్ట్రాలకు కల్పతరువుగానే ఉంది. తెలంగాణ, ఆంద్ర ప్రధేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ ఘడ్, మద్యప్రదేశ్ రాష్ట్రాలకు రామగుండం ఆర్ఎఫ్ సిఎల్ నుంచే యూరియా సరఫరా అవుతోంది. ఈ ప్లాంట్ లో రోజుకు 3850 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉన్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి 11 శాతం యూరియా సరఫరా చేయాల్సి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెల 48 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసినప్పటికీ జులైలో ఖరీఫ్ సీజన్ మొదలైన క్రమంలో ఈ ఆర్ఎఫ్ సిఎల్ కేవలం 10 రోజులు కూడా నడవలేదు.
ఈ క్రమంలో మరో సారి షట్ డౌన్ కావడంతో పది రోజులు మరమ్మత్తులకు వేచి చూడాల్సి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో యూరియా కొరత మరింత పెరిగే అవకాశాలుండడంతో రైతుల్లో మరో పిడుగు పడినట్లవుతోంది. 2021 నుంచి రామగుండం ఎరువుల కర్మాగారం ఏదో ఒక వివాదంలోనే ఉంది. గతేడాది 100 రోజులు షట్ డౌన్ చేయగా నాణత్యత లోపం, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.
మరమ్మత్తులు జరిగేనా?
ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఆర్ఎఫ్సీఎల్ నిపుణులు, ఇంజనీర్ల బృందం రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి, ప్లాంట్‌ను తిరిగి పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి మరో పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. “ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల జరిగిన తాత్కాలిక షట్‌డౌన్ మాత్రమే. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తిని మళ్లీ ప్రారంభిస్తాం.” అంటూ అధికారులు చెబుతున్నారు.
అయితే మార్కెట్లో ఇప్పటికే తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఈ తాత్కాలిక విరామం వల్ల ఎరువుల సరఫరాకు ఎలాంటి పెద్ద ఇబ్బంది కలగబోదని వ్యవసాయ ముఖ్యాధికారులు, ఆర్ఎఫ్సీఎల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందని పలువురు రైతులు, ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

