కలం, ఖమ్మం బ్యూరో: రేపటి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ‘రైతు ఆశీర్వాద సభ’కు 3 లక్షల మంది రైతులు హాజరు కాబోతున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం లచ్చగూడెం (Lachagudem) గ్రామంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు..
వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి కేవలం 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్ల రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం జమ చేసిందన్నారు. సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులు వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
రైతులే రాష్ట్రానికి వెన్నెముక అని, వారికి ప్రతి అడుగులో అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పదేళ్లలో మొత్తం రూ.72 వేల కోట్లు మాత్రమే అందించిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.35,830 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు.
రైతుల కోసం రూ.లక్ష కోట్లకు పైగానే..
వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు రుణమాఫీ, ధాన్యానికి బోనస్, పంటల బీమా, ఉచిత విద్యుత్, వ్యవసాయ యాంత్రీకరణ వంటి సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ.1,67,877 కోట్లను వెచ్చించిందని భట్టి విక్రమార్క వివరించారు.
నాగార్జునసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులతో ఖమ్మం జిల్లా వ్యవసాయాభివృద్ధిలో ముందంజలో ఉందన్న ఆయన, భవిష్యత్తులో రైతులకు మరిన్ని మేలు రకమైన కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రతి రైతు ఈ సభకు తరలిరావాలని.. మీడియా ప్రతినిధులు విస్తృత ప్రచారం కల్పించాలని డిప్యూటీ సీఎం కోరారు.
Read Also : అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ ఏడాది అలాంటి తప్పిదాలకు చెక్
Read Also: డిజిటల్ వారసులు

