కలం, స్పోర్ట్స్ : జింబాబ్వే పర్యటనకు భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌కు (Sanju Samson) చోటు దక్కకపోవడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా అన్యాయమని అన్నారు. ఇలాంటి ఎంపికలు ఆటగాళ్లలో అసురక్షిత భావన పెంచుతాయని హెచ్చరించారు. తన యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడిన అశ్విన్, ఈ నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదని చెప్పారు. దీనిని అంగీకరించడం తనకు కష్టంగా ఉందని పేర్కొన్నారు.
ఇటీవల వరుస పరాజయాలు, ఫామ్ కారణంగా సంజూను జట్టు నుంచి తప్పించారని గుర్తు చేశారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిపోయామని, మరో మ్యాచ్ ఓడితే ఇంకెవరిని తప్పిస్తారనే ప్రశ్న తలెత్తుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితులు భారత జట్టుకు మంచివి కావని అశ్విన్ (Ashwin) చెప్పారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజూ శాంసన్, ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20లో వరుసగా 5, 0, 1 పరుగులు మాత్రమే చేశారు.
ఆ తర్వాత తుది జట్టులో ఆయన స్థానంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అనంతరం జింబాబ్వే పర్యటన జట్టులో కూడా సంజూకు చోటు దక్కలేదు. తరచూ జట్టులో మార్పులు చేస్తే ఆటగాళ్ల ఆలోచనా విధానం మారుతుందని అశ్విన్ అన్నారు. మ్యాచ్ గెలిపించడం కంటే జట్టులో తమ స్థానాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెడతారని చెప్పారు. టీ20 క్రికెట్‌లో అది ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుందని హెచ్చరించారు.
భవిష్యత్తులో సంజూకు మరో అవకాశం వచ్చినా ఇదే ఒత్తిడి ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. జట్టులో స్థానం నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఆడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. అలాంటి పరిస్థితిలో వేగంగా ఆడాల్సిన చోట కూడా వ్యక్తిగత స్కోరుపైనే ఆటగాడు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసిన ప్రతి ఆటగాడికి వెంటనే భారత జట్టులో అవకాశం ఇవ్వాలన్న వాదనతో కూడా అశ్విన్ ఏకీభవించలేదు.
ప్రభ్‌సిమ్రన్ సింగ్ మంచి ఆటగాడేనని, అతను 500కు పైగా పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఒక సీజన్‌లో 500 పరుగులు చేయడమే భారత జట్టులో స్థానం ఖాయం చేస్తుందనే నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో తమ టీఎన్‌పీఎల్ జట్టులో హన్నీ సైనీ, బెంగళూరు డ్రాగన్స్‌కు చెందిన బీఆర్ శరద్ కూడా బాగా ఆడుతున్నారని చెప్పారు. దేశవాళీ ప్రదర్శన ఆధారంగానే అవకాశం ఇవ్వాలంటే వారినీ జింబాబ్వే పర్యటనకు పంపాలని వ్యాఖ్యానించారు.
Read Also: రష్మిక మందన్న భారీ సాహసం.. ఇండియన్ సినీ చరిత్రలోనే!
Read Also: డిజిటల్ వారసులు

