కలం, నల్లగొండ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా రాబోయే రోజుల్లో బీబీనగర్ ఎయిమ్స్ (Bibinagar AIIMS) దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ అగ్రగామి వైద్య సంస్థగా మారబోతోందని కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా (JP Nadda) స్పష్టం చేశారు. గురువారం బీబీనగర్ ఎయిమ్స్ సంస్థలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిమ్స్ సాధించిన ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలను ఆయన వెల్లడించారు.
గత పదేళ్లలో దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలు, మౌలిక వసతుల రంగంలో సుదీర్ఘమైన ముందడుగు పడిందన్నారు. 20వ శతాబ్దం చివరి వరకు దేశంలో కేవలం ఢిల్లీలో ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేదని, వాజ్‌పేయి హయాంలో మరో 6 ఏర్పాటు కాగా, మోదీ నాయకత్వంలో ఆ సంఖ్యను 23కు పెంచామన్నారు. వీటిలో 18 ఎయిమ్స్ లు ఇప్పటికే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గతంలో దేశంలో కేవలం 370 గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్యను ఇప్పుడు 820 కాలేజీలకు పెంచినట్లు ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా 1,85,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా నిత్యం 15 లక్షల మందికి ప్రాథమిక వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. జూన్ 2022లో మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్, కేవలం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే ఎంతో వృద్ధి సాధించిందని జేపీ నడ్డా కొనియాడారు. ప్రస్తుతం ఇక్కడ 132 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 133 మంది సీనియర్ వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు. ఎంబీబీఎస్‌తో పాటు 24 విభాగాలలో ఎండీ, 5 విభాగాలలో డీఎం, ఎంసీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు ఇక్కడ విజయవంతంగా నడుస్తున్నాయని, ఓపీడీ విభాగంలో ప్రతిరోజూ సుమారు 1,800 మంది రోగులు సేవలు పొందుతున్నారని నడ్డా పేర్కొన్నారు.
ఇన్‌పేషెంట్, ఎమర్జెన్సీ సేవలతో పాటు సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డెక్సా వంటి అత్యాధునిక పరీక్షల సౌకర్యం ఉందని, ఈ-సంజీవని టెలిమెడిసిన్ ద్వారా 1,56,000 మందికి డిజిటల్ వైద్య సలహాలు అందించారని నడ్డా (JP Nadda) వివరించారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ‘పీఎం-జై’తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఎయిమ్స్ అనేది కేవలం ఆసుపత్రి మాత్రమే కాదు, ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ అని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పరిశోధనల కోసం రూ. 64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం 129 రీసెర్చ్ ప్రాజెక్టులపై పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో..
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఎయిమ్స్ సంస్థలో ‘కమ్యూనిటీ రేడియో స్టేషన్’ ప్రారంభించిన ఘనత బీబీనగర్ ఎయిమ్స్‌కే దక్కిందని జేపీ నడ్డా తెలిపారు. ఈ సంస్థ ద్వారా 6 గ్రామాలను దత్తత తీసుకొని, 547 ఉచిత వైద్య శిబిరాల ద్వారా 66,148 మంది గ్రామీణ రోగులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ భవన నిర్మాణ పనులపై సమీక్షించగా, ప్రస్తుతం 87 శాతం పనులు పూర్తయ్యాయని జేపీ నడ్డా వెల్లడించారు.
మిగిలిన నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి ఈ సంస్థను వంద శాతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గతంలో నిమ్స్ కోసం ఉద్దేశించిన 2008 నాటి పాత భవనాన్ని ఎయిమ్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రీస్ట్రక్చరింగ్, రెట్రోఫిట్టింగ్ (రెనోవేషన్) చేయడం ఎంతో సంక్లిష్టమైన పని అయినప్పటికీ, అధునాతన వసతులతో రేడియోగ్రఫీ, ఓటీ కాంప్లెక్స్‌లను త్వరలోనే సిద్ధం చేస్తున్నామని నడ్డా తెలిపారు.
ఢిల్లీ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో పుంజుకోవడానికే 20 ఏళ్లు పట్టిందని, కానీ బీబీనగర్ ఎయిమ్స్ నాలుగేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఇది త్వరలోనే ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ విజయ్ నేత్రా, రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు డికె.అరుణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామచంద్రరావు, మాజీ ఎంపీ బి. నరసయ్య గౌడ్, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also : సింగరేణిని ఆదుకున్నా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Follow Us On: Instagram

