కలం, ఖమ్మం బ్యూరో: రేపు ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ పర్యటన పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..
గురువారం సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రీఫింగ్ కార్యక్రమంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందితో సీపీ సునీల్ దత్ సమావేశమై భద్రతా ఏర్పాట్లు, సమన్వయంపై సమగ్ర దిశానిర్దేశం చేశారు.
సభా ప్రాంగణం మొదలు హెలిప్యాడ్, వాహన పార్కింగ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను సమీక్షించారు. కేటాయించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వర్తించాలని, విధుల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
సమన్వయంతో పనిచేయాలి..
ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సిబ్బందికి సీపీ సునీల్ దత్ సూచించారు. నలుగురు అడిషనల్ డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 58 మంది సీఐ/ఆర్ఐలు, 151 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలతో పాటు 1300 మంది ఏఎస్ఐ, హెచ్‌సీ, పీసీ, హోంగార్డులు విధుల్లో పాల్గొంటున్నట్లు సీపీ వివరించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సీపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు సారంగపాణి, తిరుపతి రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

