కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్టలో కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి గొడవ పడుతున్నాడనే తీవ్ర ఆగ్రహంతో భార్య తన భర్తను రోకలిబండతో కొట్టి (Wife Kills Husband) హతమార్చింది. హత్య చేసిన అనంతరం ఆమె స్వయంగా తోటికోడలికి వెళ్లి “నా భర్తను చంపేశాను” అని చెప్పడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల (Korutla) పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీరాం అనే వ్యక్తి నిత్యం మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ప్రతిరోజూ ఈ వేధింపులు భరించలేక అతని భార్య రజినీ తీవ్ర ఆక్రోశానికి గురైంది. బుధవారం అర్ధరాత్రి కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన రజినీ.. ఇంట్లో ఉన్న రోకలిబండను తీసుకుని భర్త కాశీరాం తలపై బలంగా బాదింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో కాశీరాం రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు (Wife Kills Husband) విడిచాడు.
అయితే గురువారం తెల్లవారుజామున నిద్రలేచిన రజినీ.. నేరుగా తన తోటికోడలు లక్ష్మి వద్దకు వెళ్లి, “నా మొగుడిని చంపేశాను” అంటూ నిర్భయంగా చెప్పింది. దీంతో షాక్‌కు గురైన లక్ష్మి వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూడగా కాశీరాం రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. గత 20 రోజుల క్రితం కూడా కుటుంబ గొడవల్లో రజినీ కర్రతో దాడి చేయడంతో కాశీరాం తలకు తీవ్ర గాయాలై కుట్లు పడ్డాయని తోటికోడలు లక్ష్మి పేర్కొంది. సమాచారం అందుకున్న కోరుట్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితురాలు రజినీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: ప్రాణాలు తీస్తున్న కళ్లాపి పొడి..!
Read Also: డిజిటల్ వారసులు

