కలం, వెబ్ డెస్క్ : హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల మేర మూసీ నదిని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ రివర్‌ఫ్రంట్ (Musi Riverfront) డెవలప్మెంట్ ప్రాజెక్టు పరిధిలోని జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో అభివృద్ధి పనుల కోసం రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌తో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులను కేవలం నిర్మాణ పనుల కోసమే కేటాయించగా, భూసేకరణ వ్యయాన్ని దీని నుంచి మినహాయించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో సింహభాగం అంటే రూ.4,500 కోట్లను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి రుణ రూపంలో తీసుకోనున్నారు. మిగిలిన రూ.2,845.12 కోట్ల నిధుల కోసం హెచ్ఎండీఏ (HMDA), టీజీఐఐసీ (TGIIC) సంస్థల ద్వారా రుణాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ భారీ ప్రాజెక్టు పనులను ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కనస్ట్రక్షన్ (EPC) విధానంలో చేపట్టనున్నారు. ఏడీబీ మార్గదర్శకాలకు లోబడే టెండర్లు, కొనుగోళ్ల ప్రక్రియ (Procurement) జరగనుంది. పనుల నాణ్యతను, పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ (PMC)ను నియమించేందుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ ఉత్తర్వుల నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో తదుపరి చర్యలు వేగవంతం చేయాలని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, అలాగే ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతాలు సరికొత్త రూపు సంతరించుకోనున్నాయి.

