కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థకు చెందిన ‘ఇండియాస్ నెక్ట్స్-జెన్ సోలార్ మాడ్యూల్’ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పెట్టిస్తామని, ఇంధన రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సోలార్ ప్లాంట్ ప్రతిబింబిస్తోందని చెప్పారు.
తెలంగాణను ఆర్థికంగా అగ్రగామిగా నిలిపేందుకు 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధన కోసం క్షేత్రస్థాయిలో యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున బ్లూ-కాలర్ ఉద్యోగాల సృష్టికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

