కలం, నిర్మల్ : ఈ నెల 14న నిర్మల్ జిల్లా (Nirmal District) కేంద్రంలో నిర్వహించనున్న ఏఐటీయూసీ (AITUC) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ పిలుపునిచ్చారు. గురువారం బైంసా పట్టణంలో హమాలీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్లోని ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభల సందర్భంగా కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల (Workers Rights) సాధన కోసం ఏఐటీయూసీ గత 106 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తోందని విలాస్ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ, బ్యాంకులు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, సివిల్ సప్లై హమాలీలు, పెయింటర్ యూనియన్, వ్యవసాయ మార్కెట్ హమాలీలు తదితర రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

