కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విపత్తును (Maharashtra Floods) సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే రాయగడ్ జిల్లాలోని పాతాళగంగ ప్రాంతంలో ఒక ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే, ప్లాంట్‌లో భద్రపరిచిన సుమారు 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నదీ పాయల్లో వందలాది సిలిండర్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నదిలో కొట్టుకుపోతూ ఒడ్డుకు చేరుతున్న సిలిండర్లను స్థానిక ప్రజలు ఇళ్లకు తీసుకెళ్తుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన సిలిండర్లలో గ్యాస్ లీకేజీ అయ్యే ప్రమాదం ఉందని, ఇది పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సిలిండర్లను ఎవరూ ముట్టుకోవద్దని, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించాలని రాయగడ్ జిల్లా కలెక్టర్ ప్రజలను ఆదేశించారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన అధికారిక బృందాలు సిలిండర్లను గుర్తించి, వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకునే చర్యలను ముమ్మరం చేశాయి.

