కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో దేవుడి ఆస్తులు పరుల పాలవుతున్నా (Temple Land Encroachments) అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తున్నది. కబ్జాల్లో ‘నంబర్ వన్’గా, రాష్ట్రంలోనే అత్యధికంగా దేవాలయ భూములు ఆక్రమణకు గురైన జిల్లాగా పాలమూరు నిలవడం ఆవేదన కలిగిస్తున్నది. దేవాదాయ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 5,522.22 ఎకరాల దేవాలయ భూములు ఉండగా, అందులో దాదాపు 3,018.01 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అంటే దేవుడికి ఉన్న ఆస్తిలో సగానికి పైగా (సుమారు 54 శాతం) భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలకు 87,235.39 ఎకరాల భూమి ఉండగా, అందులో 20,124.03 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
కోర్టు చెప్పినా ఆగని ఆక్రమణల పర్వం
పాలమూరు జిల్లా సంస్థానాలకు పెట్టింది పేరు. వనపర్తి, గద్వాల వంటి సంస్థానాల పాలకులు ఆలయాలకు భారీగా భూములను విరాళంగా ఇచ్చారు. కానీ నేడు ఆ భూములను కాపాడే నాథుడే కరవయ్యాడు. వనపర్తి జిల్లా గోపాట్పేటలోని కోదండరామస్వామి ఆలయం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సంస్థానాధీశురాలు రాణి రంగనాయకమ్మ నిర్మించిన ఈ ఆలయానికి రథోత్సవాలు, జాతరల నిర్వహణ కోసం ఊరి బయట సర్వే నంబర్ 425లో 10.23 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ కాలక్రమేణా ఆ భూమిపై కబ్జారాయుళ్ల కన్ను పడింది. సంస్థానాధీశుల వారసులమని చెప్పుకుంటూ కొందరు, ప్రైవేట్ వ్యక్తులు మరికొందరు ఆ భూమిపై హక్కులు లాక్కున్నారు. న్యాయస్థానం ఆ భూమి దేవుడిదే అని 2001లో తీర్పు చెప్పినా, క్షేత్రస్థాయిలో ఆక్రమణల పర్వం ఇంకా కొనసాగుతుండడం దురదృష్టకరం.
డీజీపీఎస్ సర్వే ఫలితాన్నిచ్చేనా..?
రికార్డుల్లో ‘దేవాలయం’ పేరు ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగిపోతున్నా పట్టించుకునే వారే లేరు. దీనివల్ల ఆలయాలకు రావాల్సిన ఆదాయం (కౌలు రూపంలో గానీ, పంట రూపంలో గానీ) రాక, అనేక పురాతన ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం ఆలయ భూములకు డీజీపీఎస్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఉపగ్రహ సాంకేతికతతో కచ్చితమైన హద్దులను నిర్ణయించి, భూములను డిజిటలైజ్ చేయడం దీని ఉద్దేశం. ఇది ఎంతవరకు ఫలితాన్నిస్తుందో, దేవుడి భూములు మళ్లీ దేవుడికి చెందుతాయో లేక కాగితాలకే పరిమితమవుతాయో వేచి చూడాలి.
ఏ జిల్లాలో ఎంత మాన్యం అంటే..?
ప్రస్తుత దేవాదాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాలో 2,353.26 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 3,408.34 ఎకరాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 3,149.28 ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 5,843.08 ఎకరాలు, వనపర్తి జిల్లాలో 4,231.08 ఎకరాలు కలిపి మొత్తంగా ఉమ్మడి పాలమూరులో 18,988.24 ఎకరాల భూములు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,707.05 ఎకరాల భూములు పరుల ఆక్రమణల్లో ఉన్నాయి. ఇందులో ఎలాంటి వివాదాలు లేని భూములు 5,328.16 ఎకరాలు కాగా, 1,378.29 ఎకరాల భూములు కోర్టు కేసుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్చకులు 3,386.16 ఎకరాలలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 3,485.33 ఎకరాల దేవాలయాల భూములను లీజు పేరిట ఇతరులు వ్యవసాయం చేసుకునేందుకు అప్పగించారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం!
అధికారుల నిర్లక్ష్యం వల్లే దేవాలయాల భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు నివేదించడంలో జాప్యం చేయడం, రాజకీయ ఒత్తిళ్లకు నోరు విప్పకపోవడం కారణమని అంటున్నారు. ఎప్పుడో లీజు ఖరారు చేసుకున్నప్పటికీ, అదే లీజును ప్రస్తుతం కొనసాగించడంతో ఆలయాల ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో ఆస్తులు ఉండి కూడా అనేక దేవాలయాలు నేటికీ ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఆయా దేవాలయాలకు సంబంధించిన భూములను కచ్చితంగా మార్కు వేసి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

