కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ, మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. వర్షాలు పడటం లేదని, నీరు ఎలా ఎత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు కేవలం మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖ బాధ్యతలను అప్పగించాలని, నీళ్లు ఎలా తీసుకురావాలో ప్రాక్టికల్‌గా చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పినట్లు నీళ్లు తీసుకురాలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు.
కరువు వచ్చినా, కాలం కలిసిరాకపోయినా తెలంగాణలో ఎల్లప్పుడూ నీళ్లు ఉండే ఒకే ఒక్క ప్రాంతం మేడిగడ్డ అని, అందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ బ్యారేజ్ నిర్మించారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర 89,230 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తుంటే, రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం నీళ్లే లేవని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గత మూడు రోజుల్లోనే దాదాపు 3 లక్షల 47 వేల 180 క్యూసెక్కుల నీళ్లు, నిన్న ఒక్కరోజే 1 లక్ష 22 వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు ఏడున్నర టీఎంసీల నీళ్లు వృధాగా పోతుంటే ప్రభుత్వం ఎందుకు కన్నెపల్లి మోటార్లను ఆన్ చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. గోదావరి నది ప్రవాహం కన్నెపల్లి పంప్ హౌస్ వైపు ఉందని, ఈ నిమిషంలో అక్కడ మోటార్లు ఆన్ చేస్తే సులభంగా 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమా అని ఆయన నిలదీశారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తితే ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందోననే కుళ్లుతో, నీళ్లు ఎత్తకుండా రేవంత్ రెడ్డి రైతుల గొంతు కోస్తున్నారని హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు.
Read Also: ‘వివరణ ఇచ్చేదే లేదు’.. మంత్రి సురేఖకు కడియం కౌంటర్!
Follow Us On : WhatsApp

