epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఐఏఎస్ ఆఫీసర్లకు సీఎం సీరియస్ వార్నింగ్

కలం డెస్క్ : ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు సాకారం కావాలంటే అధికారులు సిన్సియర్‌గా పనిచేయాలన్నారు. కొద్దిమంది అధికారులు రెండేండ్లయినా వారి తీరు మార్చుకోలేదు. పనితీరు మార్చుకోకపోయినా, వారిలో మార్పు రాకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రభుత్వం గరం.. నరం.. బేశరమ్‌గా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య సమన్వయం లేదని, శాఖల మధ్య కూడా సరైన కోఆర్డినేషన్ లేదని, వ్యక్తిగత విభేదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని సీరియస్ స్వరంతోనే వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి జూనియర్, సీనియర్ అనే తేడా ఉండదని, పనిచేసేవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇకపైన ప్రతి నెలా ఆయా శాఖల కార్యదర్శులు వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా పనితీరును, శాఖల పురోగతిని, సెల్ఫ్ అప్రైజల్‌ను చీఫ్ సెక్రటరీకి నివేదిక రూపంలో సమర్పించాల్సిందేనని, అక్కడే సమీక్ష జరుగుతుందన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి స్వయంగా తానే రివ్యూ చేస్తానన్నారు.

ఏసీ గదుల్లో ఉంటామంటే కుదరదు :

వివిధ శాఖలకు బాధ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు నెలలో కనీసం మూడుసార్లు వారి శాఖ పరిధిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోడానికి ఫీల్డులోకి వెళ్ళాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రతీ పది రోజులకు ఒకసారి షెడ్యూలు రూపొందించుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమైన సీఎం.. కేవలం పది నిమిషాలు మాత్రమే మాట్లాడి వారివారి అభిప్రాయాలను వెల్లడించేందుకు తగినంత సమయమిచ్చారు. అధికారులు సరిగా పని చేయని కారణంగానే సీఎంఓ నుంచి పర్యవేక్షించాల్సి వస్తున్నదన్నారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావన్నారు. ఇందుకోసం నిర్దిష్ట మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ప్రభుత్వ విధానాలను ఎగ్జిక్యూట్ చేయాల్సిందే :

ప్రభుత్వ విజన్ (Rising Vision) కేవలం ప్రచారానికే పరిమితం కాకూడదని, అందులోని ప్రతీ అంశం అమలయ్యేందుకు నడుం బిగించాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన ‘క్యూర్’ (CURE), ‘ప్యూర్’ (PURE), ‘రేర్’ (RARE) అభివృద్ధికి అన్ని విభాగాలూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ అధికారి దగ్గర నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ ఉండాలన్నారు. ప్రభుత్వం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా, పాలసీలు రూపొందించినా విజయవంతం కావాలంటే అధికారుల సహకారం తప్పనిసరి అన్నారు. ఆఫీసర్లే నిర్లక్ష్యంగా, నిర్వీర్యంగా ఉంటే పాలన ఎలా సాగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి వెల్లువలా వచ్చిన పెట్టుబడులు ఎంత మేరకు గ్రౌండింగ్ అయ్యాయో, వాటి పురోగతి ఎలా ఉందో ప్రతి నెలా సమీక్షించుకోవాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సూచించారు.

ఉద్యోగుల డేటా బాధ్యత ఆఫీసర్లదే :

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని గుర్తుచేసిన సీఎం రేవంత్‌రెడ్డి… ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26 లోగా చీఫ్ సెక్రటరీకి అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్ అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులే పరిశీలించాలన్నారు. ఉద్యోగుల డేటా విషయంలో పూర్తి బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి 31లోగా ‘ఈ-ఫైలింగ్ సిస్టమ్’ అమలు చేయాలని గడువు పెట్టారు. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి లేకుండా అన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని నొక్కిచెప్పారు. అన్ని విభాగాలు వాటి పరిధిలోని కార్యక్రమాల అమలును తెలియజేసేలా డాష్ బోర్డును సిద్ధం చేయాలన్నారు. ఈ విధానాన్ని సీఎస్, సీఎంవో డాష్ బోర్డులకు అనుసంధానం చేయాలన్నారు.

Read Also: జీవోలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>