కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), సర్క్యులర్లు, నియమ నిబంధనలు, నోటిఫికేషన్లు తప్పనిసరిగా తక్షణమే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని హైకోర్టు (High Court) స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ ఉండాలని హైకోర్టు పేర్కొంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని ఆలస్యం చేయడం లేదా దాచిపెట్టడం సముచితం కాదని High Court వ్యాఖ్యానించింది.
ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, పాలనాపరమైన ఉత్తర్వులపై సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరులకు నిర్భందించలేని మౌలిక హక్కు అని High Court స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ప్రభుత్వం గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెబ్‌సైట్‌లో వెంటనే అందుబాటులో ఉంచడం వల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో, సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారని, న్యాయపోరాటాలకు దారితీస్తోందని కోర్టు సూచించింది.
ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వ శాఖలన్నీ హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజలకు సంబంధించిన ప్రతి నిర్ణయం అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


