కలం, నిర్మల్ : రాతి శిలలు రాగాలు పలుకుతున్నాయి.. రాక్ మ్యూజిక్ ను మరిపిస్తున్నాయి. ఆ రాగాల శబ్దాలు వినడానికి ప్రకృతి ప్రేమికులు క్యూ కడుతున్నారు.. మ్యూజికల్ స్టోన్ (Musical Stones) శబ్దాలు వింటూ మురిసిపోతున్నారు.. ఆనందంతో ఉప్పోంగిపోతున్నారు. రాగాలు పలుకుతున్న రాతి శిలలపై ప్రత్యేక కథనం..
నిర్మల్ (Nirmal) జిల్లాలో ఉన్న అతిపురాతనమైన సహ్యాద్రి పర్వతాలు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గండి రామన్న ప్రాంతంలోని కోండలపై బండ రాళ్లు ఉన్నాయి. వీటిని స్థానికులు కంచుబండలుగా పిలుస్తారు. సాధారణంగా బండ రాళ్లను ఏదైనా వస్తువుతో కొడితే ఎలాంటి శబ్దం రాదు. కానీ, ఇక్కడ ఉన్న ఒక బండరాయిని కొడితే గంటను మరిపించేలా శబ్దం వస్తుంది. ఆ శబ్దం అద్బుతంగా.. రాగాలను మరిపించేలా ఉంటుంది. రాతి శిలల నుంచి వస్తున్న శబ్దాలను చూసి స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు.
ఇలాంటి రాగాలు పలికే శిలలు మొత్తం ఉన్నాయంటున్నారు చరిత్రకారులు. ఈ శిలలన్ని అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడిన వీటి వయస్సు ఆరు కోట్ల సంవత్సరాలు ఉన్నాయని చెబుతున్నారు. లిథియం, సిలికాన్ మూలకాలు ఉండటంతో వీటిలో శబ్దాలు వస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అరుదైన శిలలను చూడటంతో పాటు శబ్ధాలను వినడానికి ప్రజలు అసక్తి చూపుతున్నారు. కానీ కొండపైకి వెళ్లడానికి దారి లేదు. అతికష్టం మీద రాతి శిలలను చూడటానికి వెళ్లి శబ్ధాలను వింటున్నారు.
ఆ ప్రాంతానికి వెళ్లడానికి మెట్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా అరణ్య వాసంలో ఉన్న శ్రీరాముడు ఇక్కడి గుహలో నివసించారనే విశ్వాసం ఉంది. గుహలో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించారని భక్తుల నమ్మకం. ఒకవైపు అరుదైన శిలలు.. మరోవైపు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి చరిత్రను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

