కలం, దమ్మ పేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట (Dammapeta) మండల పరిధిలోని అంకంపాలెం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు పర్యావరణ సంకల్పం చేపట్టారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూచనల మేరకు పాఠశాలలో ‘గుప్పెడు గింజల’ (సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
వివిధ రకాల అటవీ జాతులు, పండ్ల చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను ఎర్రని మట్టితో కలిపి అయిదు వేల సీడ్ బాల్స్ తయారు చేసి పర్యావరణంపై మక్కువ చాటుకున్నారు.
పర్యావరణంపై అవగాహన కోసమే..
ఈ విత్తన బంతులను అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో చల్లనున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు శారద తెలిపారు. విద్యార్థులతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రకృతి, పర్యావరణంపై చిన్నతనం నుంచే వారికి అవగాహన, బాధ్యత పెరుగుతాయన్నారు. పాఠశాల వార్డెన్ నాగమణి, ఉపాధ్యాయ బృందం విద్యార్థినులు విజయవంతం చేశారు.

