కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లా కేంద్రంలోని మేధో వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం డాక్టర్ దాదీస్ ఆయుర్వేదిక్ నేచర్ క్యూర్ ప్రజ్వల్ చారిటబుల్ ట్రస్ట్ వైద్య పరంగా తప్పకుండా కృషి చేస్తుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు వైద్యశ్రీ వెంకట్రావు తెలిపారు. మంగళ వారం తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి కాలనీలో గల మేధో వికలాంగుల ప్రత్యేక పాఠశాల లో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లికి చెందిన డాక్టర్ దాదీస్ ఆయుర్వేద, నేచర్ క్యూర్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ లో ఆయుర్వేద మందులు పంపిణీ చేశారని ట్రస్ట్ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు.
శిబిరంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, చుట్టు ప్రక్కల గ్రామాల వారు దాదాపుగా 300 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజ్వల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థ వ్యవస్థాపకులు వైద్యశ్రీ వెంకట్రావు మాట్లాడుతూ.. కొన్ని వేల వందల సంవత్సరాలుగా ఆయుర్వేద ప్రకృతి సిద్ధమైన మూలికలతో సుగంధ ద్రవ్యాలతో అందించే ప్రకృతి సిద్ధమైన వైద్యం తీసుకోవడంలో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని అన్నారు. మానవ జీవన శైలిలో మనకు మనమే ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడవని తెలిపారు. జన్యుపరమైన,ఆహార అలవాట్ల వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల వల్ల ఎంతోమంది బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేదో వికలాంగుల విద్యార్థులను చూస్తుంటే హృదయం చలించిపోతుందని ఆయన అన్నారు. ఆ పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని వారికి విద్యా బుద్దులు నేర్పడమే కాకుండా వారి మేధస్సుతో వృత్తి విద్యను అభివృద్ధి చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. వారే స్వయంగా పేపర్ ప్లేట్స్, చాక్ పీసులు, క్యాండిల్స్, ఫినాయిల్ ఇతర వస్తువులు తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు.
వారిని ప్రోత్సహిస్తున్న ట్రస్ట్ చైర్మెన్ చాడ వెంకటరెడ్డి, సభ్యులకు తమ ప్రజ్వల్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పిల్లల్లో మానసిక ఎదుగుదలకు, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య సహాయం చేయడానికి డాక్టర్ దాదీస్ ఆయుర్వేదిక్ నేచర్ క్యూర్ ప్రజ్వల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మందులు అందిస్తామని, వారికి ఉన్న మంద బుద్ధి పోవడానికి, మేధో శక్తి పెంచడానికి తమ ట్రస్ట్ వారికి తగిన మందులు ఇస్తోందని వెంకట్రావ్ తెలిపారు.
ఇలాగే పిల్లలకు వైద్య సేవలు అందించాలి..
ట్రస్ట్ చైర్మెన్ చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మానసిక వికలాంగుల పాఠశాలను సందర్శించి పిల్లల కోసం, వారి ఆరోగ్యం కోసం వైద్యశ్రీ వెంకట్రావు పాఠశాలకు రావడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఇతరులకు ఎలాంటి ఫీజు లేకుండా వైద్య సేవలు అందించడం, ఉచిత ఆయుర్వేద మందులు పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. వారికి పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్ లో కూడా ఇలాగే పిల్లలకు వైద్య సేవలు అందించాలని వెంకటరెడ్డి కోరారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో డి.డబ్ల్యూ.వో ఇనయతుల్లా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, మహాత్మానగర్ సర్పంచ్ పొన్నాల సంపత్, ప్రజ్వల్ చారిటబుల్ ట్రస్ట్ కు సంబంధించిన డాక్టర్లు, వెంకటేశ్వర్లు, సాజిత్ సాహెల్, సిబ్బంది మానసిక వికలాంగుల పాఠశాల ట్రస్ట్ సభ్యులు గాజుల భగవాన్, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, తేరాల సత్యనారాయణ, పాఠశాల అడ్మినిస్ట్రేటర్ బాల్ రాజ్, ప్రిన్సిపాల్ నాంపల్లి సతీష్, ఉపాధ్యాయులు, ఆయాల సిబ్బంది పాల్గొన్నారు.

