Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుల ఖాతాల్లోకి రూ.9 వేల కోట్లు: మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రికార్డు స్థాయిలో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చింతకాని మండలం జగన్నాథపురం వద్ద జరిగే ‘రైతు ఆశీర్వాద సభ’లో పాల్గొనబోతున్నారని వెల్లడించారు. సభ ఏర్పాట్లను మంత్రి మంగళవారం పరిశీలించారు. గత నెల 30న భారీ వర్షాల వల్ల వాయిదా పడిన ఈ బహిరంగ సభను ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

9వ తేదీ నాటికి పూర్తి..

​జూన్ 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల అన్నారు. ఈ నెల 9వ తేదీ నాటికే రూ.9 వేల కోట్లు జమ అవుతాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేకున్నా.. ప్రజా ప్రభుత్వం రైతులకు నమ్మకమైన భరోసాగా నిలిచిందన్నారు. మాట తప్పని పాలనలో ఈ ఆశీర్వాద సభ చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని కొనియాడారు.

పామాయిల్ సాగు చేపట్టండి..

​ప్రస్తుత సాగు పరిస్థితులపై మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయంగా ఆరు తడి, మెట్ట పంటల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల ముప్పు లేకుండా దీర్ఘకాలిక లాభాలనిచ్చే పామాయిల్ సాగు తెలంగాణకు వరమని, ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా దేశానికే మార్గదర్శిగా నిలిచిందని గుర్తుచేశారు.

వైరా రిజర్వాయర్‌కు గోదావరి నీరు..

సాగర్ నీళ్లు రాకపోయినా రైతులు నష్టపోకుండా ఉండేందుకు, సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లను రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్‌కు తరలిస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇది సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు భరోసాగా మారిందని, అవసరమైతే యాతాలకుంట నుంచి కూడా గోదావరి నీరు విడుదల చేయడానికి సాగునీటి శాఖను సర్వసన్నద్ధం చేశామని తెలిపారు.

ఎరువుల యాప్ దేశానికే ఆదర్శం..

​ఎరువుల సరఫరా నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా మారిందని మంత్రి తుమ్మల (Tummala Nageswara Rao) ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘తెలంగాణ ఎరువుల యాప్’ పనితీరును కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందన్నారు. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.

Read Also: కాళేశ్వరం ప్రాజెక్ట్ నడపలేం: మంత్రి ఉత్తమ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>