కలం, నిర్మల్ : మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో 24 గంటల పాటు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం పెంబి మండలంలో (Pembi Mandal) కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV), గ్రామపంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయా శాఖల పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఓపీ విభాగం, మందుల నిల్వ గది, ఇతర విభాగాలను పరిశీలించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, ఓపీ నమోదు, వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలను క్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
అనంతరం ZPHS పాఠశాలను సందర్శించిన కలెక్టర్ (Collector Bhavesh Mishra), వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఆయన, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ చదువులో మంచి ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. మందపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎన్యుమరేషన్ ఫారాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
తదుపరి కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి, సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. ఈ పర్యటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంఈఓ రామ్‌చందర్, ఎఫ్‌ఆర్‌ఓ కల్పనాదేవి, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: కాళేశ్వరం ప్రాజెక్ట్ నడపలేం: మంత్రి ఉత్తమ్
Follow Us On: Instagram

