కలం, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్లకు (Women Cricketers) బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవాళీ క్రికెట్ ఆడే మహిళా ప్లేయర్ల మ్యాచ్ ఫీజ్ పెంచనున్నట్లు తెలిపింది. అది కాస్త కూస్తా కాదు.. ఏకంగా డబుల్ చేయనున్నట్లు వెల్లడించింది. బీసీసీఐ తాజా నిర్ణయం ప్రకారం, సీనియర్ మహిళల దేశవాళీ వన్డే టోర్నీలు, మల్టీ-టీమ్ టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు రోజుకు రూ.50 వేలు మ్యాచ్ ఫీజుగా చెల్లించనున్నారు. గతంలో ఈ ఫీజు రూ.20 వేలు మాత్రమే. రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు రూ.25 వేలు అందనుంది.
దేశవాళీ మహిళల టీ20 టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు రోజుకు రూ.25 వేలు, రిజర్వ్ ఆటగాళ్లకు రూ.12,500 మ్యాచ్ ఫీజు చెల్లిస్తారు. ఈ పెంపుతో అన్ని ఫార్మాట్లలో ఆడే మహిళా క్రికెటర్లు (Women Cricketers) ఒక సీజన్‌లో సుమారు రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే అండర్-23, అండర్-19 స్థాయిల్లో ఆడే మహిళా క్రికెటర్లకు రోజుకు రూ.25 వేలు, రిజర్వ్‌లకు రూ.12,500 చెల్లించనున్నారు.
ఇదే సమయంలో దేశవాళీ అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ఆదాయాన్ని కూడా బీసీసీఐ పెంచింది. అంపైర్లకు లీగ్ మ్యాచ్‌లకు రోజుకు రూ.40 వేలు చెల్లిస్తారు. నాకౌట్ మ్యాచ్‌ల ప్రాధాన్యతను బట్టి ఈ మొత్తం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది. దీంతో ఒక అంపైర్ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌కు రూ.1.60 లక్షలు, నాకౌట్ మ్యాచ్‌కు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదించనున్నారు. ఈ నిర్ణయంతో మహిళా క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్ వ్యవస్థ మరింత బలోపేతం కానుందని బీసీసీఐ(BCCI) వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also: ‘వారిపై వేటు వేయడం సమస్యలకు పరిష్కారం కాదు’
Follow Us On: Instagram


