కలం, వెబ్ డెస్క్ : ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన విశాఖ పట్నం (Visakhapatnam)కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు ఇంజిన్ లోపంతో సముద్రంలో బోటు నిలిచిపోయిందని గల్లంతైన మత్స్యకారులు వీడియో రిలీజ్ చేయగా.. ఏపీ ప్రభుత్వ చర్యలతో సముద్రంలో చిక్కుకున్న 10మందిని ఒడిశా మెరైన్ పోలీసులు కాపాడారని పేర్కొన్నారు. దీంతో బోటు యజామనితో పాటు మొత్తం 10 మంది మత్స్యకారులను రక్షించినట్లు వెల్లడించారు.
ఇదిలాఉంటే విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. మర్చంట్ షిప్ ద్వారా ఓ మత్స్యకారుడిని రక్షించామని, మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో ఈనెల 1వ తేదీన చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతుకావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇందులో ఒకరిని రక్షించిన ప్రభుత్వం.. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

