కలం, వెబ్ డెస్క్: అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir)లో భక్తులు సమర్పించిన కానుకల భద్రత, నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. ఆలయంలో ప్రతిష్టించిన దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు పూత పూసిన రామచరితమానస్ (Ramcharitmanas) ప్రతిని అక్కడ నుంచి తరలించారంటూ మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణన్ బహిరంగంగా ఆరోపించారు. లక్ష్మీనారాయణన్ కుటుంబం 2024 ఏప్రిల్‌లో ఈ విలువైన బంగారు పూత పూసిన రామచరితమానస్ గ్రంథాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ పవిత్ర గ్రంథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి వేరే చోటుకు తరలించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ను వివరణ కోరగా.. ఆలయానికి వచ్చే ప్రతి కానుకను మందిరంలో ప్రదర్శించడం సాధ్యం కాదని సమాధానమిచ్చినట్లు లక్ష్మీనారాయణన్ వెల్లడించారు.
వెండి ఇటుకల అదృశ్యంపై…
రామాలయానికి విరాళంగా వచ్చిన వెండి బిస్కెట్లు, ఇటుకలు అదృశ్యమయ్యాయంటూ గతంలోనే ప్రతిపక్షాలు, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రశ్నలు లేవనెత్తాయి. అందులో ఆలయ నిర్మాణ సమయంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విరాళంగా ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక కూడా ఉంది. అయితే, ఈ కేసును విచారిస్తున్న సిట్.. దాదాపు 200 కిలోల వెండి ఇటుకలు దొంగతనానికి గురయ్యాయనే ఊహాగానాలను కొట్టిపారేసింది.
నిబంధనలు కఠినతరం
రామాలయ నిధుల అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల లెక్కింపు వ్యవస్థలో భారీ మార్పులు చేసింది. భద్రత, పారదర్శకతను పెంచేందుకు కఠిన చర్యలు అమలులోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. విరాళాల లెక్కింపు హాల్లోకి వెళ్లే ఉద్యోగులకు రెండు అంచెల స్క్రీనింగ్ నిర్వహిస్తారు. సిబ్బందికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. నగదు లేదా ఇతర విలువైన వస్తువులను దాచిపెట్టే అవకాశం లేకుండా ఉండేందుకు.. జేబులు లేని డార్క్ బ్లూ రంగు యూనిఫారాలను సిబ్బంది ధరించాల్సి ఉంటుంది.
కొనసాగుతున్న సిట్ విచారణ
రామమందిర విరాళాల అవకతవకల వ్యవహారం జూన్ 7న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆలయం నుంచి దొంగిలించబడిన బంగారు ఆభరణాలను, వాటి గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు బంగారు బిస్కెట్లుగా కరిగించారా.. అనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న 8 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

