Mobile Popup Ad
Mobile Popup Ad

జీహెచ్‌ఎంసీ చట్టానికి గుడ్‌బై.. ‘కోర్ అర్బన్ రీజియన్’ బిల్లు రెడీ

కలం, తెలంగాణ బ్యూరో : ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చట్టం (1955) స్థానంలో ఆధునిక పట్టణ పాలనకు అనుగుణంగా ‘ది కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు-2026’ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు నిర్ణయించింది. జులై 24 వరకు ప్రజలు తమ సూచనలను అందజేయాలని, అప్పటివరకు ఈ బిల్లును అధ్యయనం చేయడానికి పబ్లిక్ డొమైన్లో ఉంచుతున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది.

జీహెచ్ఎంసీతో పాటు మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ వెబ్‌సైట్లలోనూ ఈ ముసాయిదా బిల్లు అందుబాటులో ఉన్నది. ప్రజలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, పరిశ్రమలు, ప్రొఫెషనల్స్, సివిల్ సొసైటీ సంస్థలు.. ఇలాంటి ఆర్గనైజేషన్స్, వ్యక్తులు అభిప్రాయాలను వెల్లడించవచ్చని పురపాలక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

డెబ్బై ఏండ్ల కింద రూపొందించిన జీహెచ్‌ఎంసీ చట్టంలోని అనేక నిబంధనలు ప్రస్తుత మహానగర అవసరాలకు తగ్గట్టు లేవని ప్రకటనలో పురపాలక శాఖ పేర్కొన్నది. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాభివృద్ధి, ఆధునిక పట్టణ పాలన అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఈ బిల్లు ద్వారా సమగ్ర పట్టణ పాలన, శాఖల మధ్య సమన్వయం, ప్రజలకు సులభమైన సేవలు, ‘నెట్ జీరో’ లక్ష్యానికి అనుగుణమైన సుస్థిరాభివృద్ధి, మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థ, వ్యాపారాలకు అనుకూల వాతావరణం వంటి అంశాలకు ప్రాధాన్యం లభిస్తుందని తెలిపింది. ప్రజల భాగస్వామ్యంతో నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాన్ని తేవాలనే ఉద్దేశంతో ముసాయిదా బిల్లును బహిరంగ పరిశీలనకు ఉంచినట్లు పురపాలక శాఖ పేర్కొన్నది. ప్రజలు తమ అభిప్రాయాలను ఆన్‌లైన్‌లోనూ, అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖకు లిఖితపూర్వకంగానూ పంపవచ్చని వెల్లడించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>