కలం, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కొత్త సర్పంచ్‌ల పదవీ స్వీకారాలు పూర్తయ్యాయి. పాలకవర్గాలు కొలువు దీరాయి. ఇక మిగిలింది నిధులు రావడం, అభివృద్ధి పనులు చేయడం మాత్రమే. వీటి కోసం తొలి అడుగు పడింది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతోపాటు మండల పరిషత్తులకు రాష్ట్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసిది. దీని ప్రకారం పంచాయతీలకు కొత్త బ్యాంకు ఖాతా (Panchayat Bank Account)లు తెరవాలి. వీటిలోనే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు జమవుతాయి. ఈ నిధుల జమ, వినియోగంపై పీఎఫ్ఎంఎస్, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ ట్రాకింగ్ చేస్తారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పనుల స్కీమ్ నిధులకు, రాష్ట్ర గ్రాంట్లకు విడిగా మరో అకౌంట్ ఉండాలి. ఈ మేరకు కేంద్ర సర్కార్ గైడ్‌లైన్స్ కు అనుగుణంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవీ గైడ్‌లైన్స్…
ఆర్థిక సంఘం నిధులకు..:
గ్రామ సభ/ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేయాలి. పంచాయతీ లేదా మండల పరిషత్తు పేరుతో కొత్త ప్రత్యేక బ్యాంకు ఖాతా (Panchayat Bank Account) తెరవాలి. ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించినది. ఇందులో ఇతర పథకాల (గ్రామీణ ఉపాధి, రాష్ట్ర గ్రాంట్లు) నిధులు కలపకూడదు. ఈ ఖాతాకు స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ (LGD)లో మ్యాపింగ్ తప్పనిసరి. లేకపోతే పీఎఫ్ఎంఎస్‌తో ఖాతా అనుసంధానం సాధ్యం కాదు. అలాగే పంచాయతీ, ఖాతా వివరాలను ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. కొత్త ఖాతాను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో తెరవొచ్చు. అయితే, నిధుల జమ, వినియోగం ట్రాకింగ్‌కు వీలుగా రాష్ట్రం నిర్దిష్ట బ్యాంకును (యూనియన్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ) సింగిల్ నోడల్ ఏజెన్సీగా నియమించే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం నిధులకు జీరో బ్యాలెన్స్ సబ్సిడరీ అకౌంట్ విధానం అమలు చేస్తారు. డిజిటల్ చెల్లింపులు ప్రారంభించినప్పడు మాత్రమే నిధులు విడుదలవుతాయి. నేరుగా చెల్లింపులకు నిధుల విడుదల కుదరదు. కాంట్రాక్టర్లు, సప్లయర్స్ తప్పనిసరిగా పీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. చెల్లింపులకు డిజిటల్ సంతకాలు తప్పనిసరి. రెండు దశల్లో అనుమతి ఉంటుంది. చెక్/ఓచర్ సిద్ధం చేసే బాధ్యతలు పంచాయతీ కార్యదర్శి లేదా మండల పరిషత్తు అభివృద్ధి అధికారివి. చెక్ పవర్ సర్పంచ్, ఉప సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షుడు, ప్రత్యేకాధికారికి ఇచ్చారు.
రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్స్ (SFC)కు..:
గ్రామ సభ/ జనరల్ బాడీ తీర్మానం చేయాలి. పంచాయతీ/మండల పరిషత్ పేరుతో ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి. ఈ ఖాతా ఒక్కటే ఉండాలి. ఇతర పథకాల నిధులు ఇందులో కలపకూడదు. లావాదేవీలు అన్నీ డిజిటల్ విధానంలోనే జరగాలి. నేరుగా చెల్లింపులు జరపడానికి వీల్లేదు.
Read Also: ఆఫీసర్ల పనితీరుపై నేనే స్వయంగా సమీక్షిస్తా : సీఎం
Follow Us On: Sharechat


